తెలుగుదేశం పార్టీ నలభయ్యో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది. నలభై ఏళ్ల ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకంటే సగానికంటే ఎక్కువ కాలం అధికారంలో ఉంది. ఆ సంతృప్తి ఉన్నా.. భవిష్యత్ మాత్రం అస్పష్టంగా ఉంది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. కానీ సీనియర్ నేతలు మాత్రం… పార్టీలో ఎన్నో వ్యవస్థాగత మార్పులు రాబోతున్నాయని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలోకి వస్తారని ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు కంటే ముందు నుంచీ.. అంటే ఎన్టీఆర్తో పాటు రాజకీయ జీవితం ప్రారంభించిన రాజమండ్రి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి… ఇదే విషయాన్ని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో టీడీపీలో అనూహ్యమైన సంస్థాగతమైన మార్పులు రాబోతున్నాయని.. జూనియర్ ఎన్టీఆర్తో పాటు అనేక మంది టీడీపీ కోసం పని చేయబోతున్నారని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు కారణం అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట.. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. రాజకీయాల గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందామన్నారు కానీ … ఇప్పుడల్లా అలాంటి ఆలోచన లేదని కొట్టి పారేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణలకు కొన్ని కుటుంబ వివాదాలు ఉన్నాయన్న ప్రచారం ఇప్పటికే ఉంది. ఆ కారణంగా పార్టీకి దూరంగా ఉన్నారని అంటున్నారు.
అయితే పార్టీకి పరాజయాలు ఎదురైనప్పుడల్లా.. జూనియర్ ఎన్టీఆర్ చర్చ తెరమీదకు వస్తూ ఉంటుంది. ఆయన వస్తారని.. రావాలని ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. ఈ సారి బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత అనడమే ఇక్కడ ఆసక్తికరం. టీడీపీకి బలమైన వ్వయస్థాగతమైన మార్పులు జరగాల్సి ఉందన్న అభిప్రాయం మాత్రం.. పార్టీలోని అన్ని వర్గాల్లో ఉంది.