పిలిచి పిల్లనిస్తా అంటే కులం అడిగాట్ట అని సామెత! అచ్చంగా ఇదే కాకపోయినప్పటికీ.. పిలిచి టిఫిను పెడితే.. పాత సహచరుడు తన గుండెల్లో మానకుండా రగులుతున్న గాయాన్ని తిరగతోడి మరింత క్షోభ పెట్టిన వైనం ఇది. అలాగని బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడికే ఈ పరిస్థితి ఎదురైంది. దారినపోయే కంపను తగిలించుకున్నట్లు అయింది అని వగచి విచారించడం తప్ప ఆయన చేయడానికి మరేం లేకుండా పోయింది. ఇంతకూ ఈ ఎపిసోడ్ అంతా ఏపీ అసెంబ్లీ లాబీల్లో తెదేపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎదురైన సరదా అనుభవం గురించి!
మంగళవారం నాడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కనిపించడంతో, తన తెదేపాలో తన పాత సహచరుడు కావడం వలన ఆప్యాయంగా పలకరించారు. టిఫిను చేసి వెళ్లాల్సిందిగా ఏపీ లాబీల్లోకి కూడా ఆహ్వానించారు. తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీ అసెంబ్లీ లాబీల్లోకి రావడమే అందరికీ ఆసక్తిగా అనిపించింది. తెదేపాకు చెందిన నాయకులంతా పాత సహచరులే కావడంతో ఆయన వారిని పలకరిస్తూ సందడిగా గడిపారు.
ఈలోగా తలసానిని ఆహ్వానించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏదో కుశల ప్రశ్నలతో సరిపెట్టుకోకుండా.. తెలుగుదేశంలో ఉన్న సమయంలో తాము ఇద్దరమూ కలిసి సమైక్యాంధ్ర కోసం పనిచేశాం అంటూ తలసానికి పాత రోజుల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారులో మంత్రిగా ఉన్న తలసానికి, గతంలో తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా పోరాడిన వైనం గుర్తు చేయడం ఇబ్బంది కలిగించే విషయమే. అయితే అప్పట్లో ఏదో పార్టీ నిర్ణయం వలన అలా పోరాడాల్సి వచ్చిందంటూ సమర్థించుకున్న తలసాని, అయినా సరే.. కేసీఆర్ తనను పిలిచి మంత్రిపదవి ఇచ్చారని, పార్టీలో ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ తమరు మాత్రం ఎమ్మెల్యేగానీ మిగిలిపోయారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద సానుభూతి కురిపించారు.
పార్టీలో తన సీనియారిటీని మంత్రి పదవులకు పట్టించుకోలేదని పైకి చెప్పుకోకపోయినా.. లోలోపల మధనపడుతూ ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, తలసాని మాటలు పుండు మీద కారం రాసినట్లు తయారయ్యాయని పలువురు సెటైర్లు వేసుకోవడం విశేషం.