వైఎస్ఆర్సీపీ న్యాయకోవిదుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి .. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను జైలుకు పోకుండా ఆపడానికి చేసిన ప్రయత్నాలు జస్ట్ మిస్ అయ్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి ప్రయత్నించిన కేసులో అరెస్ట్ అయిన గోరంట్ల మాధవ్ ను రిమాండ్ కు తరలించకుండా చేసేందుకు వైసీపీ నాయకత్వం పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బాధ్యత ఇచ్చింది. బిజీగా ఉన్న ఆయన నల్లకోటుతో నేరుగా కోర్టుకు చేరుకుని దడదడలాడించారు.
ఆయన వాదనల కారణంగా జడ్జి గోరంట్ల మాధవ్ ను పధ్నాలుగు రోజుల కస్టడీకి పంపిస్తూ తీర్పు ఇచ్చారు. గోరంట్లతో పాటు ఇతర నిందితులనూ రిమాండ్ కు తరలించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని గోరంట్ల కోసం పంపినప్పుడే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా. ఇక భయపడాల్సిన పని లేదు.. గోరంట్ల గురించి మర్చిపోవచ్చని అనుకున్నారు. ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది. పోసాని కోసం ఆయన ఎంతో శ్రమించారు. కానీ ఆయన శ్రమ కారణంగా ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. వల్లభనేని వంశీది కూడా అదే పరిస్థితి.
గోరంట్ల మాధవ్ చేసింది చిన్న తప్పు కాదు. పోలీసు వ్యవస్థలో పని చేసిన గోరంట్ల మాధవ్ కు అది బాగా తెలుసు. ఆయన తప్పు చేయలేదని .. వాదించడానికి గట్స్ కావాలి. ఎందుకంటే వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నా.. గోరంట్ల మంచోడని నిరూపించడానికి ఎంతో అడ్డగోలు వాదన చేయగలగాలి. ఆ సామర్థ్యం పొన్నవోలకు ఉందని హైకమాండ్ పంపుతూ ఉంటుంది. ఆయన వాదిస్తారు. ఆయన వాదల్లో లోపమే ఉండదు. ఆయనకు ఆయాసం వచ్చే వరకూ వాదిస్తారు. కానీ అది రాజకీయ నేతలు చేసిన వాదనల్లా ఉంటుంది. అక్కడే సమస్య వస్తుంది. క్లయింట్లు జైలుకెళ్లిపోతారు.