వైసీపీ రాజకీయం డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆ పార్టీ బలపడేందుకు వెతుక్కుంటున్న దారులు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలనే సక్సెస్ సీక్రెట్ ను ఆచరించకుండా… వైసీపీ రాజకీయం చేస్తోంది.
కూటమి సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్తూనే.. వాటిపై సర్కార్ ను నిలదీయడం మానేసి స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు సహకరించకుండా బెదిరించడం, విధులకు ఆటంకం కల్గించడం చేస్తున్నారు వైసీపీ నేతలు. కేసులు ఎదుర్కొంటున్న నేతలంతా దాదాపు చేస్తున్న పని ఇదే. జగన్ పోలీసులను బెదిరిస్తే.. దాన్ని ఆచరణలో చేసి చూపించారు గోరంట్ల మాధవ్. తమాషాలు చేస్తున్నారా? నేను మాజీ ఎంపీని అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అయిననంత మాత్రానా పోలీసులకు సహకరించకూడదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల మద్దతు పొందాల్సిన వైసీపీ లీడర్లు ఆపని చేయడం లేదు. ప్రజలకు దూరంగా ఉంటూ పోలీసులతో వైరాన్ని తెచ్చుకుంటున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులతో పోరాటానికి సై అంటున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీయాల్సిన నేతలు.. ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన లీడర్లు.. పోలీసుల స్టేషన్ ల ఎదుట , పోలీసు అధికారులతో యుద్ధం చేస్తున్నారు. అదే వైసీపీ మార్క్ రాజకీయం ఏమో. ఈ రాజకీయం చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.