గోరంట్ల మాధవ్ పరువును నడి బజార్లో పెట్టి అయినా సరే రాజకీయంగా లాభం పొందడానికి… వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నేతలు చేసిన డ్యామేజ్ చాలదన్నట్లుగా కొత్తగా వైసీపీ నేతలు ఆయనతో సీఐడీ కేసు పెట్టించారు. వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్న సమయంలో కొత్తగా ఎంపీ గోరంట్లతో సీఐడీకి ఫిర్యాదు చేయించారు. తన మీద కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. ఈ విభాగంపై సీఐడీ కేసులు పెట్టి వేధించవచ్చన్న ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఈ కేసులో ఇప్పటికే ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా… సీఐడీ.. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాసింది. రిప్లయ్ వచ్చింది. ఆ రిప్లయ్ బయట పెట్టలేదు కానీ ఆ వీడియో వర్జినల్ కాదని స్వయంగా సీఐడీ డీఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండా సీఐడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేసు నమోదు చేసినట్లుగా బయటకు వచ్చింది. ఈ కేసుతో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చు కానీ ముందు ముందు గోరంట్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
దర్యాప్తు సంస్థ చేతులు మారిదే ఈ కేసు ఆధారంగా విచారణ జరిపి అసలు వీడియోను వెలుగులోకి తెస్తారు. అప్పుడు మొత్తం బండారం బయట పడుతుంది. అదే జరిగితే గోరంట్ల మాధవ్ గురించిన రహస్యాలు చాలా బయటకు వస్తాయి.అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. వైసీపీ హైకమాండ్ చేతిలో పావుగా మారిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.