ఆయన పోలీస్ అధికారి. సీఐ హోదాలో ఉండేవారు. ఆయన ఫైర్ ఎలా ఉండేదంటే నోట్ల రద్దు సమయంలో ఏటీఎం ముందు నిలబడి ఉన్న వారిని చూసి అమ్మనా బూతులు తిట్టి దాడి చేసేంత ఉండేది. ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై అలా దాడి చేయడంతో ఆయన అప్పట్లో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. అదే ఫైర్ ని జేసీ బ్రదర్స్పైన చూపించారు. దాంతో రాజకీయం దృష్టిలో పడ్డారు. కానీ ఇప్పుడు ఆయన ఏమయ్యారు?
ఐదేళ్లు తిరిగే సరికి ఆయనకు ముసుగు వేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన జీవితం చూస్తే.. ఇంతగా రాజకీయం మనిషిని పిచ్చోడ్ని చేస్తుందా అని ఆశ్చర్యపోక మానరు. ఎంపీగా గెలిచిన తర్వాత కియా పరిశ్రమ యాజమాన్యంపైనే ఆయన బెదిరింపులకు దిగారు. అక్కడ్నుంచి తాను ఉన్న ఇంటికి అద్దెలు కట్టకపోవడం దగ్గర నుంచి న్యూడ్ కాల్తో పరువు పోగొట్టుకోవడం వరకూ ఆయన దిగజారిపోయారు.
చివరికి ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కూడా జగన్ సిగ్గుపడ్డారు. అంటే ఐదేళ్ల కిందట జగన్ పిలిచి టిక్కెట్ ఇస్తే.. ఐదేళ్లకే ఆయన కూడా మళ్లీ టిక్కెట్ ఇవ్వలేనంత స్థాయికి దిగజారిపోయారు. వైసీపీ చెప్పిందని చేశారా.. వైసీపీ రాజకీయం అలాంటిదేనని ఆయన అనుకున్నారా అన్నది తర్వాత విషయం. ఆయనను వైసీపీ కూడా భరించలేనంత స్థాయికి వెళ్లిపోయారు. కానీ ఆయన అర్థం చేసుకోలేకపోయారు.
ఇప్పుడు కూడా ఆయన తన రాజకీయం పిచ్చిని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోగా.. విధేయతా ప్రదర్శన అంటే అదే అనుకుని చేసిన రచ్చతో జైలుకెళ్తున్నారు. అంతకంటే ముందు ముసుగేసుకుని నేరస్తుడిగా నిలబడ్డారు. పోలీసులపై దాడి చేస్తే.. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేస్తే ఏమవుతుందో గోరంట్లకు తెలియదా?. ఆయన మాట తీరు కూడా.. తేడాగానే ఉంటుంది. రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా.. మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా అన్నది చాలా మందికి అర్థం కాదు. అందుకే గోరంట్లను చూసి వైసీపీ నేతలు కూడా రాజకీయ పిచ్చి అని జాలి పడుతున్నారు.