ప్రభోధానంద అనే స్వామిజీ ఆశ్రమం విషయంలో జరిగిన రగడ.. ఏ సంబంధమూ లేని ఓ పోలీసు అధికారిక రాజకీయ యోగం పట్టించింది. అనంతపురం జిల్లా కదిరి సీఐగా పని చేసి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. తాడిపత్రి సమీపంలో ఉన్న ప్రబోధానంత ఆశ్రమంలో కొన్నాళ్ల కిందట రగడ జరిగింది. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని… వారిని జేసీ దివాకర్ రెడ్డి దూషించారు. పోలీసు అధికార సంక్షేమ సంఘం నేతనంటూ.. గోరంట్ల మాధవ్… జేసీ దివాకర్ రెడ్డికి మీసం మెలేసి మరీ.. సవాళ్లు చేశారు. ఆ విాదం కొంచెం పెద్దది చేసుకుని రాజకీయ భవిష్యత్ వెదుక్కున్నారు. కొద్ది రోజుల కిందట.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీలో చేరిపోయారు.
చాలా రోజులుగా రాజకీయ ఆరంగేట్రం కోసం.. వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం అనంతపురంలో సాగుతోంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్‌సభ టిక్కెట్ ఇస్తామని.. వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారని చెబుతున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం నదీమ్ అనే నేత ఇన్చార్జ్ గా ఉన్నారు. ఆయన బలమైన నేత కాదని… గోరంట్ల మాధవ్‌ను… రంగంలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రబోధానంద ఆశ్రమం దగ్గర.. జేసీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకునే.. మొత్తం ఓ పద్దతిగా నడిపారేమోనన్న అభిప్రాయం కూడా.. రాజకీయవర్గాల్లో వస్తోంది.
పోలీసులపై విమర్శలు చేసినందుకే..జేసీని … గోరంట్ల మాధవ్ నానా మాటలు అన్నారు. కానీ ఆయన కండువా కప్పించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి… విశాఖ విమానాశ్రయంలో నేరుగా.. పోలీస్ కమిషనర్‌పైనే విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి పోలీసు అధికారుల్ని రెండు చేతులు పెట్టి తోసేశారు. ఇలాంటివి చాలా జరిగాయి. అయినా… పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీపై విరుచుకుపడి నేరుగా వెళ్లి వైసీపీలో చేరారు.