వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి .. పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం అంతా హాట్ టాపిక్ అయింది. రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. ఆయన భాష ఏమిటో తెలియకపోయినా… ఆయన హావభావాలు… ఆగ్రహం చూసి.. “ఫిల్తీ లాంగ్వేజ్” వాడుతున్నారని వారికి అర్థమైపోయింది. గోరంట్ల మాధవ్ ఎంత ఆవేశ పడినా.. సైలెంట్‌గా ఉన్న రఘురామరాజు తర్వాత .. స్పీకర్‌కు … ప్రధానికి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఏం జరిగినా… దానికి రికార్డెడ్ ఆధారాలు ఉంటాయి. అందుకే రఘురామరాజు వ్యూహాత్మకంగా మౌనం పాటించి.. ప్రజాస్వామ్య బద్దంగా తన ఫిర్యాదు తాను చేశారు.
కానీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇది ఆయన వ్యక్తిగత వ్యవహారంగా కాకుండా… వైసీపీ తీరు అంతేనా అన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జరుగుతున్న వ్యవహారాలు… అక్కడి పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం వంటి వన్నీ చర్చల్లోకి వస్తున్నాయి. స్వయంగా రఘురామకృష్ణరాజుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీలు అత్యధికులు నమ్ముతున్నారు. అదంతా నిజమేనని నమ్మేలా.. గోరంట్ల మాధవ్ ప్రవర్తన ఉండటంతో…. ఆన వైసీపీ ఇమేజ్ను మరింత పెంచినట్లయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
సీఐగా పని చేసి … జేసీ సోదరులపై మీసం తిప్పి, తొడకొట్టి రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ వ్యవహరశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటం.. ఆయన నైజం. కియా కారు ప్రారంభోత్సవంలో ఓనర్నే బెదిరించిన ఘనత ఆయన సొంతం. వారి తొలి కారుపై నెగెటి్వ్ వాక్యాలు రాశారు. ఇప్పుడు..ఆయన పార్లమెంట్‌లోనూ అదే రుబాబు చేశారు. స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో కానీ.. “వైసీపీ అంటే… అంతే ” అనేలే ఓ బ్రాండ్‌కు ఆయన పార్లమెంట్‌లోనే.. ఓ ముద్ర వేసేశారన్న అభిప్రాయం మాత్రం… ఎంపీల్లో పాతుకుపోయేలా చేశారు.