పక్కాగా తప్పు చేశాడని తెలిసినా స్క్రిప్ట్ ప్రకారం పోలీసులతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి క్లీన్ చిట్ వచ్చిందని గోరంట్ల మాధవ్‌ను వైసీపీ వెనకేసుకు వస్తుంది కానీ .. ఆ వీడియో వ్యవహారం ఢిల్లీలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై లోక్‌సభా స్పీకర్‌కు లేఖ రాసింది. ఆ వీడియో పోర్న్ వీడియో కిందకు వస్తుందని.. తక్షణం విచారణ చేయించాలని.. ఎంపీపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ స్పీకర్‌ని కోరింది . జాతీయ మహిళా కమిషన్‌కు ఏపీ నుంచి పలు ఫిర్యాదులు అందాయి.
దీంతో ఆ వీడియోను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. విచారణ జరిపి ఎంపీపై చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లోక్ సభ స్పీకర్‌ను కోరారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ డీజీపీకి కూడా జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. త్వరలో విచారణ జరిపి వివరాలు తెలపాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ పోలీసులు ఒరిజినల్ వీడియో లేదని..ప్రస్తుతం ఉన్నది రికార్డు చేసిందని చెబుతున్నారు.
ఫోరెన్సిక్‌కు పంపడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు. ఒక్క ఎన్సీడబ్యూనే కాదు.. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ కూడా లే్ఖ రాశారు. దీంతో స్పీకర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్కడి దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేయిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చేతిలో ఉన్న ఏపీ పోలీసులతో ఏదో విధంగా మ్యానేజ్ చేసినా ఇప్పుడీ విషయం ఢిల్లీకి వెళ్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.