జగన్ రెడ్డిని ఎలా మెప్పించాలా అని కిందా మీదా పడుతున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంది వచ్చిన అవకాశాన్ని ఆబగా అందుకునే ప్రయత్నం చేశాడు. రెండు రోజులు జైలుకెళ్లినా జగన్ తన పర్ఫార్మెన్స్ ను మెచ్చి ఏదో ఓ నియోజకవర్గానికి ఇంచార్జ్ పోస్టు ఇస్తారని ఆయన ఆశపడుతున్నారు. అదేదో దక్కితే మిగిలిన దందాలు చేసుకోవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన నియోజకవర్గం లేదు. పట్టించుకునేవారు లేరు. కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేస్తే అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కూడా వచ్చారు. వాస్తవానికి ఆయన సొంత గ్రామం ఉన్నది కర్నూలు జిల్లాలోనే. పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. అది కాకపోతే అనంతపురం జిల్లాలో ఏదో ఓ నియోజకవర్గం అయినా పర్వాలేదని ఆయన విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.
కానీ జగన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో విధేయతా ప్రదర్శన కోసం వచ్చిన అవకాశాన్ని పోలీసు తెలివి తేటలతో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశారు. కిరణ్ అనే చిన్న ఐ టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారని తెలిసి.. తాను కొట్టేస్తానని బయలుదేరాడు. అలాంటి ప్రయత్నం చేస్తే కొట్టక ముందే పోలీసులు పట్టుకెళ్లిపోతారని తెలియనంత అమాయకుడేం కాదుగా ఈ మాజీ సీఐ. కానీ భారతి రెడ్డిని కించ పర్చిన వారిపై తాను దాడి చేసి.. జైలుకెళ్లానని తన విధేయతకు అదే సర్టిఫికెట్ అని ఆయన చూపించుకోవాలనుకున్నారు. చూపించారు. అనుకున్నట్లుగా జైలుకెళ్తున్నారు. మరి జగన్ ఆయన పర్ ఫార్మెన్స్ మెచ్చి ఎక్కడైనా ఇంచార్జ్ పోస్టు ఇస్తారా ?
పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో విలువలు, వలువలు అన్నీ వదిలేయడంతో టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ఏదో అధికార ప్రతినిధి అని పదవి ఇచ్చారు కానీ ప్రెస్మీట్లు పెట్టే చాన్స్ ఇవ్వరు. ఓ నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టు ఇస్తే కెరీర్ ఉంటుందని ఆయన ప్రయత్నిస్తున్నారు.