ప్రజాప్రతినిధులు కాకపోతే వారి “బూతు” చేష్టలు పూర్తిగా వ్యక్తిగతం. వారు నాలుగు గోడుల ముందు .. నాలుగు గోడల బయట ఏం చేస్తారనేది వారిష్టం. కానీ ప్రజలు ఓట్లేసి.. గౌరవంగా… చట్టసభకు పంపినప్పుడు ఆయన ఏం చేసినా ప్రజాప్రతినిధి చేసినట్లుగానే చస్తారు. ప్రశ్నిస్తారు. ఆ హక్కు ప్రజలకు ఉంటుంది. తన నియోజకవర్గ ప్రజలకే కాదు.. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడేం జరుగుతోంది తప్పు చేశారంటేని ప్రశ్నిస్తే ” అమ్మలక్కలు” తిట్టేస్తున్నారు ఈ ఘనత వహించిన ప్రజాప్రతినిధులు.
గోరంట్ల మాధవ్ అనబడే మాజీ పోలీసు అధికారి.. ఎంపీ నోటి వెంట వస్తున్న మాటలు .. ఆ బూతు వీడియోలో ఉన్నది ఆయనేననడానికి నిఖార్సైన సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇంత రోత వ్యక్తి .. మరీ అంత బరి తెగించి ఉంటాడని అందరూ నిర్ధారణకు వస్తున్నారు. మార్ఫింగో.. ఫేకో జనం తెలుసుకోలేనంత కాలం ఇది కాదు. టెక్నాలజీ ఎంతో వచ్చింది. అంతకు మించి ప్రజలకు టెక్ విజ్ఞానం పెరిగింది. ఆ వీడియో గురించి నిజం అందరికీ తెలుసు . ఈ విషయం ఎవరికీ తెలియనట్లుగా కథలు చెప్పించి… తమను తాము స్వయంతృప్తి పర్చుకుని.. ప్రశ్నించిన వారిపై బూతులతో విరుచుకుపడితే వచ్చేదేముంది..?
అవి మాటలే. ఒకటికి నాలుగు అనగలిగే సామర్థ్యం ఎదుటివారికి ఉంటుంది. కానీ అందరూ అలా తిట్టుకుంటూ పోతే బజారునపడటం కాదా ? ఇప్పటికే దేశంలో ఏపీ పరువు బజారున పడింది. ఇప్పుడు ఈ బూతులతో మరింత రోతగా మారిపోయింది. అసలు వీళ్లను ఎన్నుకున్న ప్రజలు ఎవరు అని ఇతర ప్రాంతాల వారు ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దేశంలో రాజకీయాలు ఏపీలో దిగజారినంతంగా ఎక్కడా దిగజారలేదు. తప్పుడు కేసులు.. బూతులతో దాడులు.. అంతకు మించి కుట్రలు.. కుతంత్రాల రాజ్యం అయిపోయింది.
అన్ని వ్యవస్థలనూ చెరబట్టారు. ఏ ఒక్క వ్యవస్థ ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అరాచకం రాజ్యమేలుతోంది. చివరికి తప్పు వాళ్లది కాదు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజలదే అనే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం.. ఆయా ప్రజాప్రతినిధులు.. తమకు ఓట్లేసిన ప్రజల్ని తక్కువగా అంచనా వేయడమే.