గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క సారి ఎంపీ అయి దానికి తగ్గ ఫేమ్ సంపాదించుకున్నారు. ఎలా అన్నది పక్కన పెడితే ఆయన బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఖాకీ డ్రెస్‌తో ఉంది. మాజీ సీఐ ఆయన. నోట్ల రద్దు చేసినప్పుడు డబ్బుల కోసం ఏటీఎంల దగ్గర నిలబడిన వాళ్లపై బూతులతో విరుచుకుపడి లాఠీలతో కొట్టి.. పోలీసులు ఉన్నది కొట్టేందుకేనని దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ హైలెట్ అయిన సీఐ. ఆయనపై ఓ అత్యాచారం కేసు కూడా ఉంది. అయితే తన పోలీస్ పవర్స్ ను అంతగా ఉపయోగించుకున్న ఆయన ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నోటీసులకు భయపడుతున్నారు.
ఓ పోక్సో కేసు బాధితురాలి గురించి మీడియా ముందు మాట్లాడటం.. ఆమె వివరాలు బయట పెట్టడంతో వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో గోరంట్ల మాధవ్ కు నోటీసులు వెళ్లాయి. ఐదో తేదీన హాజరు కావాల్సిన ఆయన హాజరు కాలేదు. బలప్రదర్శనగా బయలుదేరి వస్తానని చెప్పి హడావుడి చేశారు. కానీ కర్నూలు దాకా వచ్చి ధైర్యం చాలక ఆగిపోయారు. గురువారం.. లీగల్ టీంతో మాట్లాడుతానని కబుర్లు చెబుతున్నారు.
గోరంట్ల మాధవ్ వ్యవహారం చూసి టీడీపీ నేతలు నవ్వకుంటున్నారు. ఇంత భయపడేవాడు పోలీసు ఆఫీసర్‌గా ఎలా పని చేశారని అనుకుంటున్నారు. అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోయింది ఇప్పుడేమో.. నోటీసులకే భయపడి డ్రామాలాడటం కామెడీగా ఉందని అంటున్నారు. విచారణకు సహకరించకపోతే గోరంట్లను అరెస్టు చేయడం ఖాయమే. చంద్రబాబును కూడా చంపుతామని చేసిన ప్రకటనలకు మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.