రాజాసింగ్‌పై బహిష్కరణ వేటు వేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. అయితే అనర్హతా వేటు వేయమని అడగలేదు. ఒక వేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణలో మరో ఉపఎన్నిక వచ్చి పడుతుంది. రాజాసింగ్ చేసిన పని వల్ల పాతబస్తీ ఉద్రిక్తంగా మారింది. ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. పరిస్థితులు చల్లారకపోతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. అలాగే ఆయనను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయిచుకున్నారు. అందుకే బహిష్కరణ చేయాలని మజ్లిస్ తరపున స్పీకర్ కు లేఖ వెళ్లింది.
అసెంబ్లీ సమావేశాల్లో లేదా అంత కంటే ముందే రాజాసింగ్‌పై నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ అనుకుంటే ఆయనపై బహిష్కరణ కాదు.. నేరుగా అనర్హతా వేటు వేసే అవకాశం ఉంది. అలా చేస్తే ఉపఎన్నిక వస్తుంది. అసలే ఉపఎన్నికల టెన్షన్.. అందులోనూ.. గోషామహల్ స్థానానికి ఉపఎన్నిక అంటే టీఆర్ఎస్కు ఇబ్బందే. అందుకే రాజాసింగ్‌పై అనర్హతా వేటు వేసే అవకాశం లేదు కానీ.. అసెంబ్లీకి రాకుండా బహిష్కరించే చాన్స్ ఉందని భావిస్తున్నారు.
గోషామహల్ నియోజకవర్గం .. అతి చిన్న నియోజకవర్గాల్లో ఒకటి. హైదరబాద్‌లోని కోటి ప్రాంతం చుట్టుపక్కల ఉండే ఆ ప్రాంతంలో ఉండేవారిలో ఎక్కువ మంది వ్యాపారులు. హిందూ జనాభా ఎక్కువ. ముస్లింలు కూడా ఉంటారు. కానీ మెజార్టీ హిందువులు. ఇతర చోట్ల పోటీ చేసే మజ్లిస్ .. తమకు లోపాయికారీ మద్దతున్న వారి కోసం గోషామహల్లో పోటీచేయదు. పోటీ చేస్తే బీజేపీ పని మరీ సులువు అవుతుంది. మునుగోడు లాంటి నియోజకవర్గం కాదు కాబట్టి గోషామహల్‌కు ఉపఎన్నిక తెచ్చుకోరని రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.