ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి ప్రముఖ యాంకర్ వెంకటకృష్ణను గెంటేశారంటూ మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తేలిపోయింది. ఆయన ఈ రోజు నుంచి మళ్లీ ఏబీఎన్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూ. యాబై లక్షల బ్లాక్ మెయిలింగ్ కథ అంతా ఉత్తదేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. తన గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగినప్పుడే వెంకటకృష్ణ.. ఖండించారు. తాను సెలవు మాత్రమే పెట్టానని చెప్పుకొచ్చారు. అనూహ్యంగా ఆయన మూడు రోజులకే మళ్లీ ఏబీఎన్ తెరపైకి వస్తున్నారు. అయితే్.. ఆయన తొలగింపు అనేది ఎంత నిజమో.. రీ ఎంట్రీ కూడా అంతే నిజం అని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
వెంకటకృష్ణను ఏబీఎన్ నుంచి తొలగించడానికి అసలు కారణాలేమిటో వెంకటకృష్ణకు… ఏబీఎన్ యాజమాన్యానికే తెలుసు. వెంకటకృష్ణ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే… దాన్ని ఎలా డీల్ చేయాలో రాధాకృష్ణకు తెలుసు. కానీ ఇక్కడ జరిగింది బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం కాదన్న చర్చ మీడియా సర్కిల్స్‌లో నడుస్తోంది. అందుకే మూడు రోజుల్లోనే ఆ వివాదాలన్నింటికీ… ఓ పరిష్కారం చూపించుకుని మళ్లీ ఏబీఎన్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఏబీఎన్‌లో ఆయన చర్చా కార్యక్రమాలు యధావిధిగా ఉంటాయి.
ఏబీఎన్‌లో వెంకటకృష్ణ అతి చొరవ కారణంగా యాజమాన్యం ఆగ్రహానికి గురయ్యాడని.. అన్ని డిపార్టుమెంట్లలో వేలు పెట్టడమే కాదు.. తన వర్గాన్ని పెద్ద ఎత్తున చొప్పించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా ఆయనను కట్టడి చేసేందుకు యాజమాన్యం మొదటి నుంచి ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన మరీ కట్టు దాటకుండా.. ఇలా గెంటేయడం…తమకు క్షణాల్లో పని అని చెప్పడానికి షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారని కూడా చెబుతున్నారు. మొత్తానికి బ్లాక్ మెయిలింగ్ అయితే రాధాకృష్ణ మరోసారి తన చానల్లోకి వెంకటకృష్ణను రానిచ్చేవారు కాదు.. అంతకు మించి వేరే విధానపరమైన వివాదం కాబట్టే.. ఆయనకు రీ ఎంట్రీ ఇచ్చారని చెబుతున్నారు.