మోడీకి జనసేనకు మధ్య దూరం పెరుగుతోందని, మోడీ నిన్న చేసిన ప్రసంగంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పకపోవడమే ఇందుకు అత్యంత గొప్ప నిదర్శనమని కథనాలు వండి వార్చిన గాసిప్ సైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభాసుపాలు అవుతోంది. ఇవాళ ఉదయమే పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ వేదికగా మోడీ పథకాలను స్వాగతిస్తూ అప్పటికే ప్రకటన చేసి ఉన్నప్పటికీ, వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండా, పవన్ ట్విట్టర్లో ప్రకటన రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ స్పందించలేదు అనుకున్న గాసిప్ సైట్, అదే అదనుగా బిజెపికి జనసేన కు మధ్య ఏదో అయిపోతుంది, కుచ్ కుచ్ హోతా హై అంటూ కథనాలు రాయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులపాలు అయిపోయింది. వివరాల్లోకి వెళితే..
పేదలను, వలస కార్మికులను ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ఆదుకోవడానికి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగించడం, నవంబర్ వరకు నిరుపేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం వంటి ఈ నిర్ణయాల కారణంగా లక్షలాది మంది వలస కార్మికులకు పేదలకు మేలు జరుగుతుందని పవన్కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 80 కోట్లమంది ఆకలి తీర్చే విధంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయని నిన్నటి మోడీ ప్రసంగంపై స్పందించారు పవన్ కళ్యాణ్. అయితే ఇవాళ ఉదయమే పవన్కళ్యాణ్ ఈ ప్రకటన చేసి ఉన్నప్పటికీ, కొన్ని సైట్లు పవన్ కళ్యాణ్ ని బహుశా బిజెపి దూరం పెడుతోందని, బహుశా అందుకే పవన్ కళ్యాణ్ మోడీ ప్రకటనపై స్పందించలేదని తప్పుడు కథనాలు వ్రాశాయి.
గాసిప్ వెబ్సైట్ ఇటువంటి తప్పుడు కథనాన్ని రాయడానికి ప్రేరేపించిన అంశాలను కొందరు విశ్లేషించారు. ఇటీవల నిర్మలాసీతారామన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరును తీవ్రంగా మందలిస్తూ వ్యాఖ్యలు చేసి ఉండడం, బిజెపి పెద్దలు వై ఎస్ ఆర్ సి పి ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తూ ఉండడం, ఢిల్లీ పెద్దల అండ చూసుకుని సొంత పార్టీ ఎంపీ మొత్తం పార్టీని ఇరకాటంలో పెడుతూ ఉండడం, ఆయన నోటికొచ్చినట్లు పార్టీని తిడుతున్నా ఆయనని ఏమీ చేయలేని నిస్సహాయత లో ఉండిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో వై ఎస్ ఆర్ సి పి అనుకూలుర లో, ఆ పార్టీ శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేసే వెబ్సైట్లలో, బిజెపి జనసేన ఎలాగైనా దూరమైతే బాగుంటుందనే కాంక్ష ఉన్నట్లుగా కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. బహుశా అందుకే ఏదో ఒక సాకు చూసుకుని ఇటువంటి అసత్య కథనాలను గాసిప్ వెబ్సైట్స్ వండుతున్నట్లు గా ఉంది అంటూ సోషల్ మీడియాలో కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద వివరాలు సరిగ్గా చెక్ చేసుకోకుండా కథనాలు రాసి మరొకసారి గాసిప్ వెబ్సైట్ అభాసుపాలైనట్లు గా కనిపిస్తుంది. అదే సమయంలో అనేక అంశాలలో బిజెపి జనసేన ఉమ్మడి అజెండాతో ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.
"The One Nation & One Ration will help millions of migrants, extension of PM Gareeb Kalyan Yojana and free ration till November shall help 80 crore Indians stay hunger free. Thank You ? Hon. PM Sri @narendramodi ji
— Pawan Kalyan (@PawanKalyan) July 1, 2020