బిజెపి అద్యక్షుడు అమిత్‌షాపై ఎడాపెడా నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అదే మీడియా గోష్టిలో ప్రధాని మోడీపట్ల తమ విధేయతను చాటుకోవడానికి సిద్ధ పడ్డారు. చెప్పాలంటే బిజెపి ముఖ్యమంత్రులను మించి నేను మోడీ నోట్లరద్దు నిర్ణయాన్ని బలపర్చిన దానికి ఫలితమిదా అని ఆవేదన చెందారే తప్ప ఆగ్రహించలేదు. ఆయన కోపం రాజకీయ రూపం పరిశీలకులు పట్టేశారు కూడా. అందుకు తగినట్టే అమిత్ షా కూడా ఆఖరుకు వచ్చేసరికి పల్లవి మార్చారు. మేము తెలంగాణకు ఇచ్చింది వారికి హక్కుగా రావలసినవే తప్ప దయతో చేసింది కాదన్నట్టు సవరించుకున్నారు.
ఇదంతా అయ్యాక కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. తాజా పరిణామాల చర్చ పేరిట జరిగిన ఈ భేటీలో మరోసారి తన ఆవేదనను వెలిబుచ్చడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ అభ్యర్థికే మద్దతునిస్తామని తెలియజేశారట. ఈ మేరకు వారికి ఇష్టమైనమీడియా సంస్థలే వార్త నిచ్చాయి. దానిపై ఖండనలు రాలేదు గనక నిజమే అనుకోవాలి. మద్దతు నివ్వడం ఒకటైతే ఆ విషయంలో గవర్నర్ పాత్ర ఏమిటన్నది సందేహం. రాజ్యాంగపదవిలోవున్న గవర్నర్ రాజకీయ రాయబారిగానూ పనిచేస్తున్నారా? గతంలోనూ ఆయనపై ఇలాటి ఆరోపణలు వున్నాయి. ఇప్పుడు బాహాటంగానే అలాటి కథనాలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే మాత్రం రాజ్యాంగబద్దం కాదని చెప్పవలసి వుంటుంది.