ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. గట్టిగా మాట్లాడితే రెండు రాష్ట్రాలకు ప్రథమ పౌరుడు!! ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన తర్వాతే ఎవరైనా.. అలాంటి గవర్నర్ నరసింహన్ కనీసం అతిథిభవనం, విశ్రాంతి గృహం ఏమీ లేకుండా.. రోడ్డు పక్కనే ఆలయం వద్ద కారు ఆపించి.. దుస్తులు మార్చుకున్నారంటే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పరిణామం ఎలా జరిగిందంటే.. ఈ కథనం సాంతం చదవాల్సిందే…!
యాదాద్రిగా ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న యాదగిరిగుట్టలో స్వామివారికి గురువారం రాత్రి కల్యాణోత్సవం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా.. గవర్నరు నరసింహన్ సపత్నీకంగా అందులో పాల్గొంటూ ఉంటారు. యాదాద్రీశుని కల్యాణోత్సవానికి కూడా ఆయన అంతే ఉత్సాహంతో వెళ్లారు. రాత్రి పది గంటల తర్వాత తులాలగ్నంలో ముహూర్తం కాగా.. గవర్నరు దంపతులు 8.30 గంటలకే అక్కడకు వచ్చేశారు. ఉత్సాహంగా వివాహ తంతు కార్యక్రమం మొత్తం తిలకించారు. అయితే ఊరేగింపు పూర్తయి సకాలంలో ఉత్సవమూర్తులు కల్యాణవేదికకు చేరుకోకపోవడం గవర్నరుకు ఆగ్రహం తెప్పించింది. కారణం ఆరా తీస్తే.. కొందరు రాజకీయ ప్రముఖులు ఇంకా రాకపోవడం వల్ల కార్యక్రమాన్ని ఆలస్యంగా నడిపిస్తున్నట్లు సమాధానం వచ్చింది. దీంతో ఆయన మరింత ఉగ్రులైపోయారు.
‘ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు?’ అంటూ అధికార్లపై చిందులేసిన గవర్నరు.. కాసేపు అసహనంగానే అక్కడ గడిపి.. కల్యాణంలో మాంగల్యధారణ ఘట్టం కాకముందే అక్కడినుంచి శ్రీమతితో కలిసి వెళ్లిపోయారు. కల్యాణానికి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయన.. అలాగే ఆ దుస్తులైనా మార్చుకోకుండా వెళ్లి కారులో కూర్చుని హైదరాబాదు బయల్దేరేశారు. మార్గమధ్యంలో రాయగిరి కట్టమీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనాన్ని ఆపి, గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని వెళ్లారుట.
ఇంతకూ గవర్నరుకు ఇంతగా ఆగ్రహం తెప్పించేలా.. దేవుడి కల్యాణం లేటుగా జరిగేందుకు కారకులైన రాజకీయ నాయకులు ఎవరా అని ఆరా తీస్తే.. మొత్తం ఆ కార్యక్రమంలో పాల్గొన్నదే నలుగురు ప్రముఖులు. డిప్యూటీ స్పీకరు పద్మాదేవేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాత్రమే. ఈ నలుగురిలో ఎవరు లేటయ్యారో తెలియదు గానీ.. మొత్తానికి గవర్నరు గారికి మాత్రం ఇంతెత్తున కోపం వచ్చేసిందని అర్థమవుతోంది.