హైదరాబాద్: ప్రతి అంశాన్నీ సంచలనం చేసే ప్రయత్నం చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మీడియాకు హితవు పలికారు. ఆపదలో ఉన్నవారిని ప్రాధాన్యమివ్వాలే తప్ప ఆ సంఘటనలను ఫోటోలు, వీడియోలు తీసి సంచలనం చేయాలనే దృక్పథాన్ని వీడాలని అన్నారు. సెన్సేషనలిజం కొన్ని క్షణాలే బాగుటుందని, నిస్సహాయులకు సాయం చేయటం ఆత్మ సంతృప్తినివ్వటంతోపాటు సమాజానికి మేలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఈ వ్యాఖ్యలు అసహనంతో చేస్తున్నవి కావని, జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా మాట్లాడుతున్నవని అన్నారు. అసోమ్‌లో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన తన సోదరుడి పార్థివ దేహాన్ని తీసుకొస్తుంటే, ‘కైసా లగ్తా హై’ అని మీడియా తనను ప్రశ్నించిందని చెప్పారు.
తాను దేవాలయాలకు వెళ్ళటాన్ని వార్తలుగా ప్రచురించటాన్ని తప్పుబట్టారు. గవర్నర్ దేవాలయాలకు వెళ్ళటం తప్పూ కాదు, వార్తా కాదన్నారు. అధికారిగా, గవర్నర్‌గా తాను చేసిన సేవలకుగానూ తనకు విలువ ఇవ్వమనటం లేదని, తన వయసును గౌరవించమని కోరుతున్నానని చెప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీడియానుకూడా సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరముందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మీడియాకుకూడా ప్రవర్తనా నియమావళి ఉండాలన్నారు. బ్రేకింగ్ న్యూస్ పేరుతో సెన్సేషనలిజాన్ని ప్రజలపై రుద్దకుండా సమాజానికి మేలు చేసే అంశాలపై మీడియా దృష్టి సారించాలని నరసింహన్ సూచించారు.