ఇటీవల జరిగిన సచివాలయ పరీక్ష పేపర్ లీక్ అయి ఉండవచ్చు అంటూ వస్తున్న వార్తలు నెమ్మది నెమ్మదిగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఈ వ్యవహారమంతా అప్పట్లో బీహార్ లో జరిగిన సంఘటనను తలపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి బీహార్ తరహా పరిష్కారం కూడా తీసుకుంటారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన సచివాలయ పరీక్షల్లో టాపర్గా నిలిచిన వ్యక్తి టైపిస్ట్ గా ఒక సంస్థలో పని చేస్తున్నారని, ఆ సంస్థయే సచివాలయ పరీక్షల నిర్వహణ అవుట్సోర్సింగ్ తీసుకుందని, అదేవిధంగా ఏపీపీఎస్సీ ఉద్యోగుల దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు పలువురు టాప్ ర్యాంక్ సాధించారని, ఇవన్నీ చూస్తుంటే పరీక్ష పేపర్ లీక్ అయిందేమో అన్న అనుమానాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో బీహార్ లో కూడా పేపర్ లీకేజీ కి సంబంధించి ఇలాంటి సంఘటన ఒకటి ప్రజలని విస్తుపోయేలా చేసింది.
రూబీనా రాయ్ అనే విద్యార్థిని 2016లో 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్ గా నిలిచింది. అయితే ఆమె పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి అని అడిగితే అది ఒక వంటలకు సంబంధించిన శాస్త్రం అని చెప్పడం వివాదాలకు దారి తీసింది. ఆ తర్వాత పేపర్ లీక్ అయింది అన్న విషయం నిర్ధారణ కావడం, తను అరెస్ట్ కావడం జరిగింది. 2017 లో గణేష్ అనే మరొక వ్యక్తి ఇలాగే మరొక పరీక్షల్లో టాపర్గా నిలవడం, మీడియా అడిగిన అతి చిన్న ప్రశ్నలకు కూడా తను సమాధానం చెప్పలేక పోవడం, ఆ తర్వాత తను కూడా అరెస్ట్ కావడం జరిగింది.
అప్పట్లో బీహార్ లో జరిగిన ఈ పరిణామాల వంటివి ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, మరి అప్పట్లో బీహార్లో అనుమతించినట్లు గా మీడియా సమక్షంలో ఈ టాపర్స్ ని ప్రశ్నలు అడగడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ పార్టీలు ప్రభుత్వాన్ని పేపర్ లీకేజ్ విషయం పై ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రజల సందేహాలు తీర్చడానికి ప్రభుత్వం ముందడుగు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.