ఉద్యోగం సంఘం నేతగా “సామాజిక బాధ్యత”గా భావించి ప్రభుత్వానికి ఇతోధికంగా సేవ చేసిన ఎపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి ప్రభుత్వం సలహాదారు పదవి ప్రకటించింది. ఆయనకు ఉద్యోగు సేవల విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు పదవిలో నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. జీతభత్యాలు ఇతర సలహాదారుల్లాగే అందే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు.
ఎస్ఈసీతో ప్రభుత్వం ఘర్షణ పూరిత వైఖరి అవలంభించినప్పుడు ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలంటే పెట్టాలని..వద్దంటే వద్దని ఉద్యోగుల తరపున వాదించిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి ముందు ఉంటారు. పలు మార్లు ఆయన ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు.. నోటిఫికేషన్‌ను బహిష్కరిస్తున్నామని కూడా ప్రకటించారు. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.
ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని కూడా డిమాండ్లు చేశారు. కోర్టులకు కూడా వెళ్లారు. మరి ఉద్యోగుల సమస్యల గురించి ఎందుకు పోరాడలేదని అడిగితే.. ప్రభుత్వంపై సానుభూతి చూపేవారు. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా రూ.రెండు, మూడు లక్షల వేతనంతో సలహాదారు పదవి లభించింది. ప్రతి ఒక్కరికి సలహాదారు పదవి ఇచ్చేయడం.. ఏపీ ప్రభుత్వంలో కామన్‌గా మారిపోయింది.