ఘోర రైలు ప్రమాదం జరిగింది. 39 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. విజయనగరం జిల్లాలో కూనేరు వద్ద హీరాకండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే! ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాలూ వెంటనే సహాయక చర్యలకు దిగాయి. హుటాహుటిన స్పందించాయి. కేంద్రం కూడా ఈ ప్రమాదంపై వెంటనే స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది! సో… ప్రభుత్వాలు చేయాల్సిన రొటీన్ ప్రాసెస్‌ను పూర్తి చేశాయి. ఇదే క్రమంలో తమపై విమర్శలు రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్న తీరు చూస్తుంటే… సామాన్యుడి కడుపు రగిలిపోకుండా ఎలా ఉంటుందీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కావాల్సినంత అనుకూల మీడియా ఉంది! ఇలాంటి ఘోర ప్రమాదం జరిగిన సమయంలో కూడా సర్కారును సేఫ్ గార్డ్ చేస్తూ కథనాలు గుమ్మరింపులో గుక్కతిప్పుకోవడం లేదు. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోతే… ఇంకేదో మహా ముప్పు తప్పిందని నిపుణులూ రైల్వే అధికారులు అభిప్రాయపడ్డట్టు చెబుతున్నారు! ప్రమాద స్థలికి ఇంకాస్త దూరంలో వంతెన ఉందనీ, ఆ తరువాత అటవీ ప్రాంతం ఉందని అంటున్నాయి. అది నిజమే కావొచ్చు… కానీ, ఇప్పుడు ఆ చర్చ ఎందుకూ..? ప్రయాణికుల భద్రత అంశంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న కోణాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు..? రైల్వే శాఖ వైఫల్యాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు..? ఇక, ప్రభుత్వం తీరుగా తగుదునమ్మా అన్నట్టుగానే ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే.. ఇది నక్సల్స్ ప్రతీకార చర్య కావొచ్చనీ, గతంలో ఇదే ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి… దానికి కౌంటర్ ఎటాక్ ఇదే అయ్యుండొచ్చని అధికారంలో ఉన్నవారే ఊహించేస్తున్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిగిన తరువాత కదా కారణాలు బయటపడేది! ఇప్పుడీ డైవర్షన్లు ఎందుకూ..? గతంలో రైలు ప్రమాదాలు జరిగితే.. రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపించేవి. ప్రమాదానికి నైతిక బాధ్యత వహించిన ప్రభుత్వాలూ ఉన్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు! ఏ ప్రమాదం జరిగినా… ఇది విద్రోహ చర్య, ఎవరిదో ప్రతీకార చర్య, పాకిస్థాన్ హస్తం ఉందేమో అంటూ ప్రభుత్వాలే చెప్పేస్తున్నాయి! తమ పనితీరుపై విమర్శలు రాకుండా ముందుగానే తప్పించేసుకుంటున్నాయి..!
ప్రమాదాలు జరిగిన తరువాతే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్ప… ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తమ బాధ్యత కాదనుకుంటున్నాయి. భద్రత విషయంలో రైల్వే శాఖ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రయాణ ఛార్జీలను ఎన్నిరకాలుగా పెంచాలో రైల్వే శాఖకు బాగా తెలుసు. గట్టిగా చెప్పాలంటే.. అదొక్కటే తెలుసు!