రాజన్న ఎలా మొదటి సారి అధికారం సంపాదించారు..? రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి..!. రాజన్న పోరాటం ఏ ప్రాతిపదికన సాగింది.. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించడంపై వ్యతిరికేత మీద..! .. ఇప్పుడు రాజన్న పాలన తీసుకొస్తానని చెబుతున్న రాజన్న బిడ్డ పాలనలో ఏం జరుగుతోంది..? ఉచిత విద్యుత్‌కు బదులుగా.. ఎంత కరెంట్ వినియోగిస్తే.. అంత డబ్బులిస్తామంటున్నారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు. అంటే.. రాజన్న బిడ్డ తీసుకొచ్చిన రాజన్న పాలనలో.. రాజన్న ప్రవేశ పెట్టిన పథకానికే తిలోదకాలిచ్చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకూ చాలా అంటే.. చాలా పనులు… ” వైఎస్ ” ఉంటే అలా చేసి ఉండే వారు కాదని.. చెప్పుకుంటూ వస్తున్నారు కానీ.. మొట్ట మొదటి సారి… ఆయన “అధికారం అడుగు”నే పెకిలించే ప్రయత్నం జరుగుతోంది.
నగదు బదిలీ బండారం గ్యాస్ సబ్సిడీ వ్యవహారంతోనే తేలిపోలేదా..?
అది 2013వ సంవత్సరం. గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఎత్తివేసి.. ఎంత సబ్సిడీ ఇస్తున్నామో.. అంత మొత్తం వినియోగదారు ఖాతాలోకి మళ్లిస్తామని కేంద్రం ఓ సంస్కరణ తీసుకొచ్చింది. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆందోళనలు చేసింది. చివరికి ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయం వద్దనుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే.. తాము వ్యతిరేకించిన నగదు బదిలీని అమలు చేయడం ప్రారంభించారు. మొదట్లో.. నాలుగు, ఐదు వందలు వచ్చే సబ్సిడీ.. ఇప్పుడు రూ. 60.. రూ. 70కి పడిపోయింది. పోనీ గ్యాస్ సిలిండర్ ధర ఏమైనా తగ్గిందా అంటే అదీ లేదు. కానీ ఇచ్చే సబ్సిడీని రకరకాల రూపాల్లో తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు… ఇస్తున్న సబ్సిడీ చాలా పరిమితం. ప్రభుత్వాలు… పథకాలకు బదులు తాము ఎందుకు నగదు బదిలీ చేయాలని కోరుకుంటాయో.. ఇదో పెద్ద ఉదాహరణ. ఈ గ్యాస్ సబ్సిడీనే… కేస్ స్టడీగా తీసుకుంటే… ఆంధ్రప్రదేశ్ రైతులు … నగదు బదిలీ పేరుతో ఎలాంటి కష్టాల్లో చిక్కుకోబోతున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
జీతాలే ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం.. ఇక విద్యుత్ సబ్సిడీ ఠంచన్‌గా ఇస్తుందా..?
అసలు… ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలనుకోవడానికి కారణం.. కేంద్రం పెట్టిన షరతు. కేంద్రం ఎందుకు షరతు పెట్టిందంటే… రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇష్టానుసారం ఉచిత విద్యుత్ దగ్గర్నుంచి అనేక రాయితీలు…ప్రకటిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. కానీ ఆ రాయితీల సొమ్ము.. విద్యుత్ సంస్థలకు జమ చేయడం లేదు. ఇప్పటికీ ఉచిత విద్యుత్ పేరుతో.. ఏపీ సర్కార్ .. రైతులకు ఇస్తున్న కరెంట్‌కు బకాయిలు వేల కోట్లలోనే ఉన్నాయి. అంటే చెల్లించలేదన్నమాట. ఈ ప్రభుత్వ సబ్సిడీలు అధికమైపోతూండటం… ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతూండటంతో… విద్యుత్ సంస్థలపై భారం పెరిగిపోతోంది. అప్పుల కుప్పలుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని కేంద్రం అనుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలకు సబ్సిడీలుగా ఇస్తున్న మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లించేలా.. చేయాలని నిర్ణయించుకుంది. దాని ప్రకారమే… నగదు బదిలీ అమలు చేయాలనే షరతు. దీని ప్రకారం.. ప్రభుత్వాలు బకాయిలు పెండింగ్ పెడితే.. అది లబ్దిదారులకే కానీ.. విద్యుత్ సంస్థలకు కాదు. విద్యుత్ సంస్థలకు రైతులు బకాయి పడతారు. అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలిగి.. రైతు భజాలపై భారం పెడుతోందన్నమాట. ప్రభుత్వం కూడా అదే చెబుతోంది.. కానీ రైతులకు ఏ కష్టమూ రాదని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. వ్యవసాయ విద్యుత్ కకెన్షన్లు ఉన్న ప్రతీ రైతుకు బ్యాంకులో ఓ ఖాతా తెరుస్తారు. ఆ ఖాతాలోనే… ఆ నెల వచ్చిన బిల్లు మొత్తం ప్రభుత్వం జమ చేస్తుంది. అలా జమ చేసిన మొత్తం ఆటోడెబిట్ ద్వారా.. మళ్లీ విద్యుత్ సంస్థల ఖాతాలోకి వెళ్తుంది. అంటే.. ఏపీ సర్కార్ రైతులకు ఇచ్చినట్లుగా… ఆ రైతులు.. విద్యుత్ సంస్థలకు కట్టినట్లుగా రికార్డు అవుతుంది. అంటే.. ఇక్కడ ప్రభుత్వం తప్పించుకోవడానికి. రైతులు ఎంత వాడుకుంటే.. అంత చెల్లించి తీరాల్సిందే. కానీ.. ప్రస్తుతం జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం బిల్లులు జనరేట్ అవ్వగానే… వేల కోట్లు ఎలా తెచ్చి రైతుల ఖాతాల్లో వేస్తుందనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. ఎప్పుడైనా ప్రభుత్వం చెల్లించడం ఆలస్యం అయితే.. రైతులు విద్యుత్ సంస్థలకు బాకీ పడినట్లవుతుంది. అదే జరిగితే.. రైతను తర్వాత తర్వాత డిఫాల్టర్‌గా గుర్తించి బ్యాంకుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడతారు.
అప్పుల కోసం రైతుల ప్రయోజనాల్ని కూడా తాకట్టు పెట్టాలా..?
ఉచిత విద్యుత పథకానికి బదులుగా నగదు బదిలీ ఇస్తున్నామని.. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని… మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అలా జరుగుతుందా..? అంటే.. అంచనా వేయడం కష్టం. రైతుల్లో కులాలు, మతాలు, వర్గాలు.. పార్టీలు వెలుగులోకి వస్తాయి. అనేక మంది రైతుల్ని ఈ వర్గాల ప్రకారం విభజించి అనర్హుల్ని చేస్తారు. ఇప్పటి వరకూ.. రైతు చిన్న రైతా.. పెద్ద రైతా అనే తేడా లేదు. రైతును రైతుగా గుర్తించారు. మీటర్లు లేకపోవడంతో సమస్యే రాలేదు. ఇప్పుడు వాలంటీర్లు రంగంలోకి వస్తారు. ఇతర అధికారులు రంగంలోకి వస్తారు. మీకు ఇంత ఉచిత విద్యుత్ సబ్సిడీ వస్తుంది.. మా సంగతేంటి అని పీల్చి పిప్పి చేస్తారు. ప్రభుత్వాలు అవినీతిని అరికడతామని ఎన్నిమాటలు చెప్పినా… ఆచరణలో సాధ్యం కావు. ఇప్పుడు రైతులు.. ఈ అవినీతికి బలవడానికి ఈ విద్యుత్ సబ్సిడీకి నగదు బదిలీ మార్గం చూపించబోతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో ఎలా పని చేస్తారో తెలియని విషయం కాదు. వాలంటీర్లను పెట్టినా.. వారి పనీతురు రోజూ హెడ్ లైన్స్ అవుతూనే ఉంది. అందుకే రైతుల ప్రయోజనాల్ని ప్రభుత్వం అప్పుల కోసం తాకట్టు పెడుతోంది.
కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటిస్తున్నా… మీటర్ల జోలికి పోవడం లేదుగా..!?
కేంద్రం ఇచ్చే ముష్టి అప్పు కోసం సవాలక్ష కండిషన్లు… ఆ ముష్టి మాకొద్దు.. అని తెలంగాణ సీఎం కేసీఆర్ నేరుగానే తేల్చి చెప్పారు. ఆయన చెప్పింది… అప్పుల కోసం.. కేంద్రం పెట్టిన షరతులే. ముఖ్యంగా విద్యుత్ రంగంలో పెట్టిన సంస్కరణలు అమలు సాధ్యం కాదని అలా చేస్తే.. విద్యుత్ వ్యవస్థ రాష్ట్రం చేతుల నుంచి వెళ్లిపోతుందని.. దాంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన చెబుతున్నారు. దీంతో కేంద్రం చెప్పిన విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి ఆయన ససేమిరా అన్నట్లయింది. తెలంగాణ సీఎం కూడా.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఏపీలో ఆరు గంటలు మాత్రమే ఇస్తున్నారు. తొమ్మిది గంటలు ఇస్తామని ఏడాదిన్నర నుంచి చెబుతున్నారు. కానీ తెలంగాణ సీఎం.. రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఉచితంగా ఇస్తున్నారు. కానీ ఆయన వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు పెట్టాలని.. బిల్లులు తీయాలని.. వాటికి నగదు బదిలీ చేయాలనే ఆలోచన చేయడం లేదు. ఎదుకంటే.. రైతుల గురించి కేసీఆర్‌కు బాగా తెలుసు. వారికి వీలైనంత సాయం చేయాలనుకుంటారే కానీ.. రాష్ట్ర అప్పుల కోసం వారిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ.. రైతు రాజ్యం పేరుతో.. జగన్మోహన్ రెడ్డి.. తాను చేస్తున్న అప్పుల కోసం.. రైతుల ప్రయోజనాల్ని తాకట్టుగా పెడుతున్నారు. పధ్నాలుగు నెలల కాలంలోనే.. అన్ని మార్గాల నుంచి తీసుకొచ్చిన లక్ష కోట్లకుపైగా అప్పు.. ఎటు పోయిందో తెలియని పరిస్థితిలో ఇంకా ఇంకా అప్పుల కోసం… మెల్లగా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అందులో రైతుల ప్రయోజనాలు కూడా ఉండటం దురదృష్టకరం.
క్షమించు రాజన్న ..!
గత పధ్నాలుగు నెలల నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే.. ఇలా చేసి ఉండేవారు కాదు.. అనే మాటను… పదే పదే ఉపయోగిస్తున్నారు. అన్నీ ప్రభుత్వ నిర్ణయాల గురించే. ఇంత నిర్దాక్షిణ్యంగా రాష్ట్రానికి ఆదాయం సంపాదించి పెట్టే ప్రాజెక్టుల పీక పిసికి ఉండేవారు కాదు. అభివృద్ధిని ఆపేసి.. మొత్తం సంక్షేమానికి పెట్టి ఉండేవారు కాదు. గెలిచిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల కక్ష సాధింపు కోసం సమయం వెచ్చించేవారు కాదు. పెట్టుబడులు లేకపోయినా పర్వాలేదని నిర్లిప్తంగా ఉండేవారు కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే… ప్రస్తుత ప్రభుత్వం చేసిన ఒక్క పని కూడా.. ఆయన చేసి ఉండేవారు కాదు. కానీ రాజన్న పాలన నడుస్తోందని… వైసీపీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా రాజన్న పాలన ఉండి ఉంటే. .. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ.. ఇప్పుడు.. ఉచిత విద్యుత్ అధికారికంగా లేనట్లే. దాని నగదు బదలీ చేస్తారు. ఎప్పుడు చేయకపోతే… రైతులు కరెంట్ బిల్లులు కట్టుకోవడం ప్రారంభించాలి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్దు అనుకున్నది ఇదే.. అందుకే క్షమించు రాజన్న…!