తెలుగు దేశం పార్టీ ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తోంది. వాటిని వైసీపీ పైకి ఖండిస్తోంది…కానీ లోపల మాత్రం చర్యలు తీసుకుంటోంది. సారా మరణాల విషయంలో టీడీపీ ఆందోళనలు చేయడంతో పోలీసులతో పెద్ద ఎత్తున దాడులు చేయించి… సారా కేసుల్ని పట్టుకున్నారు. లక్షల లీటర్లు దొరికింది. అదే సమయంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. తణుకు మున్సిపాలిటీ చేత స్థలాలు కొనిపించి.. వాటిని మళ్లీ టీడీఆర్ బాండ్ల రూపంలో కేటాయింప చేసుకుని రూ. 390 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమండ్ చేశారు.
అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రే మున్సిపల్ కమిషనర్ ఎన్.వాసుబాబు, టీపీవో ఎ.రామకృష్ణ, టీపీఎస్ ఏఎస్ ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం అక్రమంగా టీడీఆర్ బాండ్లు జారీ చేయడమే. 2020-2021లో 71,502 గజాలు, ఆగస్టు 2021 నుంచి డిసెంబరు 2022 వరకు మరో 32,933 గజాలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రూ.390 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజమని తేలిపోయింది.
అయితే అసలు కుంభకోణం సూత్రధారి ఎమ్మెల్యే అని ఆయనను రక్షించడానికే అధికారుల్ని బలి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. సీబీఐ విచారణ జరిపించి.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.