వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను నియమించింది. అందరూ వైసీపీ కార్యకర్తలేనని ఘనంగా ఆ పార్టీ ముఖ్యులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని నియమించారు. రెండేళ్లలో పర్మినెంట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం.. జగన్ మాటంటే మాటే అని నమ్మిన అనే్క మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. ఇతర రంగాల్లో మంచి భవిష్యత్ ఉన్న వారు వచ్చి చేరిపోయారు. రెండేళ్లు చాలా ఎక్కువ కాలమే అయినా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంగా మారుతుందన్న ఆశతో అడ్డగోలు రూల్స్ పెట్టినా ఓకే చేసి చేరిపోయారు.
కానీ రెండేళ్లు దాటిపోయింది.. రెండున్నరేళ్లు దాటిపోయింది. వారికి ఉద్యోగాలను పర్మినెంట్ చేయకపోగా ఎంత టార్చర్ పెట్టాలో అంతా పెడుతున్నారు. చివరికి మరుగుదొడ్ల దగ్గర డబ్బులు వసూలు చేసే డ్యూటీలు కూడా వేస్తున్నారు. డ్రెస్స్ల దగ్గర్నుంచి మూడు పూటలా హాజరు నమోదు చేసుకోవడం దగ్గర్నుంచి వారిపై ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ప్రతీ దానికి సచివాలయ ఉద్యోగుల్నే పిలుస్తారు . వారి ఏ పని చెప్పినా చేయాలన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇంకా టార్చర్ ఏమిటంటే వారికి ప్రొబేషన్ ఇవ్వడానికి పరీక్షలు పెట్టడం.
సచివాయ ఉద్యోగులకు ప్రొబేషన్ కోసం పలు రకాల పరీక్షలు పెడుతున్నారు. పరీక్షల ద్వారా పాసయ్యే వారు ఉద్యోగం తెచ్చుకున్నారు. వారి ఒప్పందపత్రంలో ఎక్కడా మళ్లీ పరీక్షలు రాస్తేనే ఉద్యోగం పర్మినెంటే చేస్తామని లేదు. కానీ మళ్లీ పరీక్షలు పెడుతున్నారు. ఫెయిలవుతున్నారని చాలా మందిని భయపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సచివాయ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. రెండున్నరేళ్ల సమయం వృధా పోతే పోయిందని ఇప్పుడన్నా కొత్త కెరీర్ చూసుకుందామని అనుకుంటున్న వారినీ ప్రభుత్వం వదలడం లేదు . ఇప్పటిదాకా తీసుకున్న జీతం ఇచ్చేసి వెళ్లాలంటోంది. దీన్ని చూసి సచివాలయ ఉద్యోగులకు నోటమాట రావడం లేదు. తమ పట్ల అత్యంత క్రూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు.