ఉవ్వెత్తున ఎగసిన పీర్సీ ఉద్యమాన్ని ఏ ప్రయోజనాలు నెరవేరకుండానే ముగించేసిన ఉద్యోగ సంఘ నేతలను ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకు వచ్చింది. బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, ఎపీఎన్జీవో బండి శ్రీనివాసరావు, కే సూర్యనారాయణతో పీఆర్సీ అంశంపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. పీఆర్సీ ఉద్యోగులు ఎప్పుడు ఆందోళనలకు పిలుపునిస్తే అప్పుడు చర్చలు పెట్టే ప్రభుత్వం.. సోమవారం కూడా అదే పని చేసింది. ఉద్యోగులు చలో తాడేపల్లికి పిలుపునిస్తే ఉద్యోగ సంఘాల నేతల్ని హడావుడిగా పిలిచి చర్చలు ప్రారంభించింది.
అసలు ఈ ఉద్యోగ సంఘ నేతలకు సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న నేతలకు సంబంధం లేదు. వారు తమ డిమాండ్ కోసం చాలా గట్టిగా పట్టుబటి ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సిందేనంటున్నారు. పీఆర్సీ చర్చల సమయంలో మార్చి 31వ తేదీలోపు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. కానీ ఏప్రిల్ నెలాఖరు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడలేదు. ప్రభుత్వం పిలవగానే తమకు సంబంధం లేకపోయినా చర్చలంటూ వెళ్లిపోయారు.
ప్రభుత్వం వారితోే మాట్లాడి.. సీపీఎస్ రద్దు ఉద్యోగ సంఘాలే వద్దన్నాయని ప్రత్యామ్నాయంగా కొంత మేలు చేస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కొత్త కమిటీని నియమించింది. సీఎస్ నేతృత్వంలో కమిటీ పని చేస్తుంది. ఇప్పటికి సీపీఎస్‌పై ఎన్ని కమిటీలు వేశారో స్పష్టత లేదు. మళ్లీ కొత్త కమిటీ నియమించారు. అసలు సీపీఎస్ ఉద్యోగులు మాత్రం తగ్గేది లేదంటున్నారు.