ఓ వైపు ప్రభుత్వం మొట్టు దిగదు. మరో వైపు కార్మికులు పట్టు వీడరు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రాణాలు అయినా పణంగా పెడతాం కానీ.. వెనక్కి తగ్గేది లేదని కార్మికులు అంటున్నారు. ఆర్టీసీ సమస్య చిక్కుముడిగా మారిపోయింది. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. తెగేదాకా లాగితే.. సమస్య పరిష్కారం కాకపోనూ..మరింత జఠిలం అవుతుంది. సమస్య పరిష్కారం కావాలంటే… రెండు వైపుల నుంచి ఎవరో ఒకరు తగ్గాల్సి ఉంటుంది.
చర్చిస్తే ప్రభుత్వ “ఈగో” హర్ట్ అవుతుందా..?
సాధారణంగా కార్మికులు సమ్మెలు చేస్తు ప్రభుత్వాలు .. ఎలాంటి బేషజాలకు పోకుండా.. చర్చలు జరుపుతాయి. ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే కార్మికుల సమ్మెలకయితే హుటాహుటిన స్పందిస్తాయి. ఎందుకంటే ప్రజల సాధారణ జీవితానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ… వాళ్లతో మేము చర్చలు జరపడమేంటి.. అనే .. స్థాయిబేధాల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. ఆర్టీసీ అనేది ప్రజారవాణ వ్యవస్థ. వారి మంచీ చెడ్డలు చూడాల్సింది కూడా ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం కూడా.. ప్రజల కంటే పెద్దది కాదు. ప్రజల వల్లే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ తెలంగాణలో దానికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘం నేతలతో మేము చర్చించడం ఏమిటన్నది పాలకుల ప్రధాన అభ్యంతరంగా ఉంది. ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు.. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినవారే. టీఆర్ఎస్ మద్దతుతో సొంత సంఘాలు ఏర్పాటు చేసుకున్నవారే. అలాంటి వారే ఇప్పుడు తమను డిమాండ్ చేయడం ఏమిటన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. కానీ కార్మిక సంఘం నేతలు ఎవరి మద్దతుతో ఎదిగినప్పటికీ.. ఇప్పుడు వాళ్లు 50వేల మంది కార్మికుల బాధ్యతను తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికులు తెలంగామ బిడ్డలు కాదా..!?
ఆర్టీసీ కార్మిక సంఘం నేతలకు ఉన్న బాధ్యత ప్రభుత్వానికి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాభై వేల మంది బాధ్యత తీసుకున్న వారే అన్నీ వదిలేసి రోడ్లకు మీదకు వస్తే… వారితో సహా.. తెలంగాణ ప్రజలందరి బాధ్యత తీసుకున్న ప్రభుత్వం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ప్రజల ఉద్యమంతోనే తెలంగాణ తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇలా ఎందుకు ఉంటున్నారో… అప్పట్లో ఆయనతో కలిసి పని చేసిన వారికీ పజిల్గానే ఉంది. నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా.. కేసీఆర్ చలించడం లేదు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలే కబ్జా చేస్తున్నారని కార్మికులు తీవ్ర విమర్శలు చేస్తున్నా… లైట్ తీసుకుంటున్నారు.
ప్రజలిస్తేనే అధికారం..! వారితో ఈగో సమస్యలేంటి..?
ఇప్పుడు కార్మికులు కూడా వెనక్కి తగ్గలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమను గుర్తించడానికే నిరాకరిస్తున్న పరిస్థితుల్లో వారు వెనక్కి తగ్గితే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్లే అవుతుంది. సకల జనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచిన ఉద్యమకారుల్లో ఆర్టీసీ కార్మికులూ ఉన్నారు. వారు అపజయాన్ని అంగీకరించలేరు. కానీ వారు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయాన్ని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ప్రభుత్వం ముందుకు వస్తే పరిష్కారం దొరుకుతుందనే ఆశలు కార్మికులు కల్పిస్తున్నారు..