రాజధాని మార్పుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. ఉద్యోగులు తిరుగుబాటు చేసి.. సమ్మె వంటి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా.. చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముందుగా ఊహించిన సీఎం..ఉద్యోగులకు.. వరాలను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా.. ప్రతి కుటుంబానికి ఏటా.. రూ. రెండు నుంచి ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామనే తరహాలో ఉద్యోగులకు వరాలు సిద్ధమయ్యాయని.. ఉద్యోగ సంఘాల నేతలు ప్రచారం ప్రారంభించారు.
విశాఖకు రాజధాని మారినప్పటికీ.. వారానికి ఐదు రోజుల పనిదినాలు కొనసాగుతాయి. అలాగే.. ప్రతి ఉద్యోగికి వుడా పరిధిలో రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. అలాగే.. ఏకంగా 30 శాతం హెచ్ఆర్ఏ, 10 శాతం సీసీ అలవెన్స్, ఇంకా.. రీలోకేట్ అయినందుకు.. స్థాయిని బట్టి.. రూ. యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరాయి. ఇక దీర్ఘ కాల ప్రయోజనాలు కూడా కల్పించనున్నారు. అమరావతిలో ఇచ్చినట్టే బస్సు, రైలు ప్రయాణ రాయితీని కొనసాగించి.. ఉద్యోగుల పిల్లలకు విద్యా సంస్థల్లో ఫీజులు లేకుండా చదువులు చెప్పించాలని అలాగే.. తక్షణం వేతన సవరణను ప్రకటించాలని భావిస్తున్నారు.
అయితే.. ఈ ప్రతిపాదనలన్నీ.. ఆర్థిక భారంతో కూడుకున్నవే. కనీసం.. 15వేల కోట్లు ఉద్యోగులకు తాయిలాలుగా ఇవ్వడానికే సరిపోతాయని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే… పూడ్చుకోలేనంత లోటులో ఉంది. ఉద్యోగులకే ఇంత ఇస్తే.. విశాఖలో.. కార్యాలయాల కోసం.. ఇతర అవసరాల కోసం.. కనీసం నాలుగైదు వేల కోట్లను తాత్కలికంగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంత సొమ్ము ప్రభుత్వం వద్ద ఉందా..అనేది కీలకమైన విషయం.