వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో సమావేశం అయిన కార్యాలయం ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సెక్రటేరియట్ లో ఎందుకు ఎంపీలతో సమావేశం పెట్టుకున్నారని అనుకున్నారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి అధికారిక సమీక్షలు చేసేది… ఆయన షిక్కీలు టేస్ట్ చేసే ఫోటోలు.. బటన్లు నొక్కే వీడియోలు.. ఇంకా చెప్పాలంటే చిరంజీవిని అవమానించి ఈగో చల్లార్చుకున్న ఘటన కూడా అక్కడే జరిగింది. అదంతా ప్రభుత్వ కార్యాలయం అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు అది వైసీపీ ఆఫీసు. జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఓ భాగం.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోం చేశారు. కేబినెట్ సమావేశాలకు తప్ప ఎప్పుడూ సెక్రటేరియట్ కు వెళ్లలేదు. వర్క్ ఫ్రం హోం చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తన ఇంట్లో కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్నారు. అది తన ప్రైవేటు ఆస్తి. అయినా కిటీకీలు, ఏసీలు, కుర్చీలు, మైకులు సహా మొత్తం ప్రజాధనంతోనే ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ్నుంచే పాలన చేశారు. ఇంటి నుంచి బయట పెట్టకుండా వ్యవహారాలు నడిపారు.
ఇప్పుడు ఓడిపోయారు. వెంటనే ఐదు లక్షల అద్దె కట్టాల్సి వస్తుందని తన పార్టీ కార్యాలయాన్ని తాడేపల్లి నుంచి ఖాళీ చేయించి ఇంటికే ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకూ సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నదాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి చెందిన ఎలాంటి వస్తువు ఉన్నా సరెండర్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడకుండా వాడేసుకుటున్నారు. జగన్ పార్టీ ఆఫీసులో ఉన్న ప్రతి వస్తువూ ప్రజాధనంతో కొనుగోలు చేసిందే.
గతంలో కొంత ఫర్నీచర్ కోడెల వద్ద ఉందని చెప్పి ఆయనపై దొంగ ముద్ర వేసి మానసికంగా వేధింది ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ప్రజా ధనంతో కొన్న వస్తువులన్నీ వైసీపీ ఆఫీసు నుంచి ప్రభుత్వానికి సరెండర్ చేయకపోతే ఆయనపై కూడా అదే ముద్ర వేయడం ఖాయం. అయితే కోడెల ఫీలయ్యే మనస్థత్వం కాదు… వేధిస్తున్నారని.. రోడ్డు మీద పడి యాగీ చేసే రకం. అయినా ప్రజాధనాన్ని ప్రభుత్వం అలా వదిలేయలేదుగా.. స్వాధీనం చేసుకోవాల్సిందే.