వలస కార్మికుల విషయంలో అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రాష్ట్రాల మీద ఫైరయిపోయారు. వలస కార్మికులను స్వస్థలకు చేర్చే బాధ్యత తీసుకోవాలని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తూంటే.. వారిపై వాహనాలు వెళ్లిన ఘటనల్లో పలువురు చనిపోయారు. ఇలాంటివి జరగకుండా.. అన్ని రాష్ట్రాలు కేంద్రంతో సమన్వయంతో వ్యవహరిస్తే.. వారి కష్టాలు తీరుతాయని పవన్ కల్యాణ్ తేల్చారు. రాష్ట్రం గుండా వెళ్తున్నారు కానీ..వారు మన రాష్ట్ర పౌరులే కాదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం సరికాదనేది…పవన్ వాదన. రాష్ట్రాలు బాధ్యత తీసుకోకపోతే సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రతీ రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల చెమట చుక్కల భాగస్వామ్యం ఉందన్నారు.
ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ గురించి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పలు పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల వారు పని చేస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని.. గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజా రవాణా వ్యవస్థ బస్సులను వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ఉపయోగించాలని కోరారు. సరిహద్దు వరకూ విడిచి పెడతామని ఏపీ సర్కార్ ప్రకటనపైనా…పవన్ పరోక్షంగా స్పందించారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సరిహద్దు దగ్గర వదిలిపెడతాం అనడం బరువు వదిలించుకొన్నట్లు అవుతుందన్నారు. అలా విడిచి పెడితే కొత్తసమస్యలు వస్తాయన్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆంధ్రులను అనుమతించకపోవడంపైనా పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వలస కూలీల సమస్య జాతీయసమస్యగా మారింది. అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ…కేంద్రం వైపు చూస్తున్నారు. కేంద్రంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తాము గట్టి చర్యలు తీసుకుంటున్నామని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది కానీ..బాధ్యత రాష్ట్రాలదే అనడం లేదు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్… ఆ పార్టీని పల్లెత్తు మాట అనలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. వలస కార్మికుల విషయంలో తప్పంతా.. రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారంటు్ననారు.