జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి తను సిద్దంగా ఉన్నానని పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ సయీద్ నిన్న జమ్మూలో ప్రకటించిన వెంటనే బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిర్మలా సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికే చాలా ఆలస్యమయింది కనుక ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ మహబూబా ముఫ్తీ వీలయినంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆమె తండ్రిగారు మా పార్టీతో పొత్తులు కుదుర్చుకొనే ముందు ఉమ్మడి కార్యాచరణపై దాదాపు రెండు నెలల పాటు ఇరు పార్టీలు చర్చించుకొని తయారుచేసాయి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినపట్టికీ ఆయన హయాంలో అనుకొన్న ఉమ్మడి కార్యాచరణను యధాతధంగా అమలుచేయడానికి నేటికీ బీజేపీ కట్టుబడే ఉంది. కనుక మహబూబా సయీద్ తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు చేయాలి,” అని అన్నారు. 87మంది ఉండే జమ్మూ కాశ్మీర్ శాసనసభలో పిడిపికి-27, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య మళ్ళీ సయోధ్య కుదిరినట్లే ఉంది కనుక నేడో రేపో పిడిపి, బీజేపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును.