తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. ఎప్పుడో విభజన హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చాలా రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై దానిపై ఒక్కొక్కటిగా అఫిడవిట్లు దాఖలు చేయడం ప్రారంభించింది. అదీ కూడా.. ఒకేసారి కాకుండా.. శాఖల వారీగా… ఒకదానికి ఒకటి పొంతన లేకుండా.. అసత్యాలు.. అర్థసత్యాలు… పాత సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఒక్కో అఫిడవిట్ బయటకు వచ్చినప్పడల్లా.. ఏపీలో కలకలం రేపుతోంది. ఎందుకంటే… కేంద్రమంత్రులు బయట చెప్పేది ఒకటి ఉంటే… అఫిడవిట్లలో మరొకటి ఉంటోంది. సాధారణంగా మంత్రులు బయట చెప్పేవి హామీలు అవుతాయి. వాటిని నమ్మలేం. కానీ సుప్రీంకోర్టుకు చెప్పేది అధికారికంగా వాటిని నమ్మి తీరాలి. అందుకే అఫిడవిట్ దాఖలు చేసినప్పుడల్లా ఏపీలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ… ఎప్పుడైతే.. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని అఫిడవిట్ దాఖలు చేసిందో.. అప్పట్నుంచి రచ్చే. ఆ అఫిడవిట్ వల్ల రేగిన కసితో… సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు. అందులో అంతా పాత సమాచారమే ఉందని… టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రత్యేకహోదా దగ్గర్నుంచి నిన్నామొన్నటి రైల్వేజోన్ వరకూ ఏ ఒక్క అఫిడవిట్ కూడా.. ఏపీ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. చివరికి సోమవారం కూడా.. కేంద్ర మానవ వనరుల శాఖ ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులోనూ… కడుపు మండిపోయే విషయాలే పొందు పరిచింది హెచ్ఆర్డీ మినిస్ట్రీ.
అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఎప్పుడో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఇక పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే మిగిలింది. ప్రస్తుత సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆగస్టు నుంచి క్లాసులు నిర్వహిస్తామని… హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో జరిగిన స్వల్పల కాలిక చర్చలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ బిల్లు ఇంకా తమ శాఖ పరిశీలనలోనే ఉందని అఫిడవిట్ లో తెలిపారు. ఇతర శాఖలు దాఖలు చేసిన అఫిడవిట్ల మాదిరిగానే.. సగం, సగం సమాచారమే .. ఇందులోనూ ఉంది.
కేంద్రం ఇలా ఎందుకు తప్పుడు వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ అఫిడవిట్ల వ్యవహారం.. ఏపీ బీజేపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారుతోంది. వారికి ఎలా సమర్థిచుకోవాలో అర్థం కావడం లేదు. అవన్ని పాత వివరాలని..మళ్లీ రివైజ్ చేసి అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్పుకొస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం… ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు. కచ్చితంగా ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్లను సమయం చూసి మరీ కోర్టులో సమర్పిస్ోతందన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో ప్రారంభమయ్యాయి.