విశాఖ బ్రాండిక్స్ సెజ్‌లో వరుసగా గ్యాస్ లీకవుతున్నాయి. వందల మంది కార్మికులు అనారోగ్యం పాలవుతున్నాయి. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా స్పందిస్తుంది. వారి ప్రాణాలకు పెద్దగా విలువ లేనట్లుగా వ్యవహరిస్తోంది. బ్రాండిక్స్ సెజ్‌లో ఉన్న సీడ్స్ పరిశ్రమలో కొద్ది రోజుల కిందట గ్యాస్ లీకయి వందల మంది ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. ఒక్కరికి రూపాయి సాయం చేయని ప్రభుత్వం కంపెనీపై కనీస చర్యలు తీసుకోలేదు. పైగా మంత్రి అమర్నాథ్ రెడ్డి సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు. ఏసీలోని గ్యాస్ లీక్ అయిందని చెప్పుకొచ్చారు. అప్పుడు విచారణకు కమటీ నియమించారు. కానీ ఆ కమిటీ ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు.
తాజాగా మరోసారి గ్యాస్ లీక్ కావడంతో వందల మంది మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. ఆ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పదే పదే కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సీఎం జగన్ తీరిగ్గా సమీక్షా చేసి.. విచారణకు ఉన్నత స్థాయి కమిటీ అని ప్రకటించారు. నివేదిక కోసం ఆ కమిటీకి నెల గడువిచ్చారు. కానీ అప్పటికి మర్చిపోతారని అనుకుంటారు. గతంలో కమిటీ గురించి అంతే మర్చిపోయారు. అయితే ఈ సమస్యను జనరలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అన్నికంపెనీల్లో సెక్యూరిటీ ఆడిట్ చేయాలంటూ హడావుడి కూడా ప్రారంభించారు. గతంలో ఎల్జీ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ఇంత కంటే ఎక్కువ హడావుడి చేశారు. కానీ అది కేవలం పై పై ప్రకటనలే.. చర్యలేం లేవు. అందుకే ఇలావరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాల్సింది పోయి.. నాటకాలు.. ప్రకటనలతో మభ్యపెట్టి.. ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు అవకాశం కల్పిస్తోంది. గత మూడేళ్లలో అతి భారీ ప్రమాదాలు పలు చోట్ల చోటు చేసుకోవడమే దీనికి సాక్ష్యం.