విశాఖలో లక్ష్మి పార్వతి గవర్నర్ బంగ్లాలో మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ అధికారులు ఇక్కడ కాదు ఇంకెక్కడైనా మాట్లాడుకోమని నిర్మోహమాటంగా చెప్పేశారు. తర్వాత గుడివాడ అమర్నాథ్ కు అదే పరిస్థితి. దీంతో ఆయన గవర్నర్ బంగ్లా ఎదుట .. నిలబడి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ బంగ్లాలో రాజకీయ ప్రెస్ మీట్లు వద్దని అధికారులు ముఖం మీదనే చెప్పారన్నమాట. మరి అంతకు ముందు గవర్నర్ బంగ్లాలో రాజకీయ సమావేశాలు పెట్టలేదా అంటే… మంత్రి అమర్నాథ్ పెట్టిన ప్రతీ ప్రెస్మీట్ అక్కడే. మరి ఈ సారి ఎందుకు అడ్డుకున్నారు. అక్కడే కనిపిస్తోంది మార్పు.
ఇది బయటకు తెలిసిన మార్పేనని.. లోపల చాలా వరకూ..అధికారులు భయపడిపోతున్నారని ఇంత కాలం చేసిన అరాచకాలు ఓ లెక్క ఇప్పుడు ఎన్నికలకు ముందు మరో లెక్క అని .. వీలైనంత వరకూ తప్పించుకు తిరగడం మేలని భావిస్తున్నట్లుగా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చివరి రోజుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. చాలా చోట్ల ఉన్నతాధికారులు … ఫైల్స్ ను పక్కన పెట్టేస్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక పోలీసు అధికారుల్లోనూ భిన్నమైన స్పందన కనిపిస్తోంది.
నిజానికి వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు ఉన్న పోలీసుల్ని..కేసులు ఉన్న పోలీసుల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసే టీముల్లో నియమించుకున్నారు. ఇప్పుడు వారే ఎక్కువగా టెన్షన్ కు గురవుతున్నారు. మరో వైపు ప్రభుత్వానికి విచ్చలవిడిగా ట్యాపింగ్ సర్వీస్ చేసిన వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రికార్డులు డిలీట్ చేసినా.. తగులబెట్టినా ఏం జరుగుతుందో తెలంగాణలో ప్రణీత్ రావు ఉదంతం కనిపిస్తోంది. దీంతో అధికారులు.. ఈ కొంత కాలం … వీలైనంత వరకూ వైసీపీకి ఊడిగం చేయకుండా తప్పించుకుంటే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారు.