ఎట్టకేలకు వరి మద్దతు ధరను కేంద్రం పెంచింది. క్వింటాకి రూ. 200 పెంచుతూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా స్వాగతించదగ్గదే. ఇది రైతులకు మేలు చేసే నిర్ణయం అనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. వరితోపాటు 14 రకాల ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది వర్షపాతం కూడా ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో మద్దతు ధర పెంచడం ద్వారా ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. పంటల మద్దతు ధరలను పెంచుతామంటూ కేంద్రం ఇచ్చిన హామీని కూడా ఈ నిర్ణయంతో నిలబెట్టుకున్నట్టు అవుతుంది.
తీసుకున్న నిర్ణయం కచ్చితంగా హర్షణీయమే. కానీ, సమస్యంతా ఎక్కడంటే… పంటల మద్దతు ధరలో విషయంలో కూడా రాజకీయ కోణాలనే అధికారంలో ఉన్న పార్టీలు చూస్తూ ఉండటం! ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందే మద్దతు ధరలను పెంచాల్సిన అవసరం ఏముంది..? ఇంతకు ముందూ పెంచొచ్చు. అదే చేసి ఉంటే ఆ మేరకు రైతులు మరింత సంతోషంగా ఉండేవారు కదా! సరిగ్గా ఎన్నికల వరకూ వెయిట్ చేసి… రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేసేదాకా ఆగి.. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ లబ్ధి కోణం లేదని ఎలా అనగలం..?
అయితే, తాజా నిర్ణయం అమలు పరిస్థితి ఏంటనే ప్రశ్నలూ ఉన్నాయి. మార్కెట్ ధర రైతుల వరకూ వెళ్తుందా, ప్రభుత్వ నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మార్కెట్ లో చెలామణి అవుతుందా అనే ప్రశ్నలున్నాయి..? ఇక్కడో ఇంకో స్పష్టత రావాల్సిన అంశం ఏంటంటే… ప్రభుత్వ మద్దతు ధర కంటే మార్కెట్ ధర తక్కువ ఉంటే, మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వమే కొంటుందా..? ఒకవేళ కొందామని సిద్ధపడినా వాటిని నిల్వ చేయగలిగే స్థాయిలో గోడౌన్లు ఉన్నాయా..? నిర్వహించే ప్రభుత్వ యంత్రాంగం ఉందా..? ఇలాంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి.
ఏదేమైనా… ఒక నిర్ణయంగా చూసుకున్నప్పుడు వ్యవసాయానికి ఇది ప్రోత్సాహకారిగానే చెప్పుకోవచ్చు. అయితే, నాలుగేళ్ల తరువాత ప్రకటించడమనేది ఫక్తు రాజకీయ లబ్ధి అనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వాలు కూడా ఇందుకు అతీతం కాదు. యూపీయే ప్రభుత్వం కూడా అప్పట్లో రుణమాఫీ విషయంలో ఇలానే నిర్ణయం తీసుకుంది. సమస్య ఏంటంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా రైతుల విషయానికి వచ్చేసరికి నాలుగేళ్లు దాటాకనే ఆలోచిద్దామనే ఒక రాజకీయ వ్యూహానికి కట్టుబడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ ఇతర అంశాలన్నీ రాజకీయ లబ్ధి కోణం నుంచే జరుగుతున్నవే. కనీసం వ్యవసాయం విషయంలోనైనా ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా ఈ రాజకీయ పార్టీలు ఆలోచించలేవా..?