గుడివాడ అమర్నాథ్ అంటే ఎవరు ?. వైసీపీలో జగన్ రెడ్డి తర్వాత …కేబినెట్ లో కూడా జగన్ రెడ్డి తర్వాత కూడా తానే అన్నంతగా బిల్డప్ ఇచ్చే లీడర్. కానీ అది అప్పుడు… ఇప్పుడు ఆయనకు కనీసం మంత్రిగా ప్రోటోకాల్ లభించడం కూడా లేదు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చూస్తే ఆయన అసలు పదవిలో ఉన్నారా లేదా అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది.
విశాఖ జిల్లా మంత్రిగా గుడివాడ అమర్నాథ్ .. ప్రోటోకాల్ కలిగి ఉన్నారు. అంటే విశాఖకు ఎవరైనా ప్రముఖులు వస్తే ప్రభుత్వం తరపున ఆయన స్వాగతం చెబుతారు. ఇప్పటి వరకూ అదే చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం గుడివాడ అమర్నాథ్ ప్రోటోకాల్ గౌరవాన్ని తొలగించింది. ఎవరైనా ప్రముఖులు వస్తే ఆయన స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖకు ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ రానున్నారు. ఆయనకు స్వాగతం చెప్పే బాధ్యతను బూడి ముత్యాలనాయుడుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ స్వాగతం చెప్పే గుడివాడ అమర్నాథ్ కు ఈ పరిణామంతో తీవ్ర అవమానం ఎదురైనట్లయింది.
అనకాపల్లికి వేరే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ హైకమాండ్ .. అమర్నాథ్ కు మరో సీటు చూపించలేదు. దీంతో ఆయన నియోజకవర్గం లేని మంత్రిగా ఉండిపోయారు. రాను రాను ఆయనకు సీటు లేదన్న ప్రచారం ఉద్ధృతమవుతోంది. దీంతో తన తలరాత జగన్ రాస్తారంటూ ఆయన మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రోటోకాల్ కూడా తీసేశారు. గుడివాడ అమర్నాథ్ బయటకు పవన్, చంద్రబాబుపై ఎలా రెచ్చిపోతారో… జగన్ రెడ్డి పై కూడా అంతర్గతంగా అలాగే మాట్లాడి ఉంటారని.. ఆ విషయంలో జగన్ కు తెలియడంతోనే ఆయన ఫేక్ విధేయను పట్టించుకోకుండా మెల్లగా తొక్కేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలో ప్రారంభమయ్యాయి. కారణం ఏదైనా అంతా పాపం అమర్నాథ్ అనే పరిస్థితి వచ్చింది.