‘తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉంది ఏపీ సర్కారు వైఖరి! పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్ రైతుల ఆవేదన అనూహ్యంగా తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. విశ్వమాన వేదిక అనే సంస్థ ఆధ్వర్యంలో కొంతమంది బాధిత రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలుసున్నారు. దాంతో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెరమీదికి వచ్చాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఆక్వా రైతుల విషయమై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారంటూ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియా ముందుకు వచ్చారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేలా చూడమంటూ సీఎం అభిప్రాయపడ్డట్టు ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్వాఫుడ్ నిర్మాణం ఉంటే చర్యలు తప్పవని చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేసినట్టు రామాంజనేయులు అన్నారు. ఈ ఫుడ్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకించడం లేదనీ, కేవలం వ్యర్థాల విషయంలోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 25 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్క్‌ను సముద్ర తీరానికి తరలించడం సాధ్యమయ్యే పనికాదని స్పష్టం చేశారు. ఫుడ్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ గ్రామాలకు వెళ్తుందనీ, రైతులతో మాట్లాడి అనుమానాలను నివృత్తి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సో… ఇదన్నమాట ప్రభుత్వం స్పందన! అక్కడ రైతుల గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే, ప్రజలను ఇళ్లలోంచి బయటకి రానీయకుండా పహారా కాస్తుంటే… ఇన్నాళ్లూ ఆ వార్తల్ని బయటకి పొక్కనీయకుండా చేశారు. ఇంత పెద్ద సమస్యను చాలా సింపుల్‌గా ‘ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం’ అని చెప్పి ఊరకుంటే సరిపోతుందా..? కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందట! అంటే, దేనిపై అవగాహన… ఫుడ్‌పార్క్ ఎంతగొప్పదో వివరిస్తారా..? రాష్ట్ర అభివృద్ధికి అది ఎంత కీలకమో చెబుతారా…? ఇప్పటికే పాతిక కోట్లు ఖర్చుపెట్టాం కాబట్టి వెనక్కి తగ్గడం సాధ్యం కాదని చెబుతారా..? ఇవన్నీ ప్రభుత్వం సైడ్ వాదనలే. రైతుల వైపు నుంచి ఉన్న సమస్యలపై స్పందన ఏదీ..? గ్రామాల్లో అమల్లో ఉన్న 144 సెక్షన్ గురించి చంద్రబాబు మాట్లాడలేదు..! రైతులపై పెట్టిన కేసుల గురించీ మాట్లాడలేదు..! బెయిళ్లు కూడా లేకుండా జైల్లో హింస అనుభవిస్తున్న రైతుల గురించి మాట్లాడలేదు..! ముఖ్యమంత్రి సమీక్షించారు… అంటే ఇదేనా..?