ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని తెలిసిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా ఓ కంపెనీ ఖాతాలో పడుతున్నాయని తెలుసుకుని.. వెంటనే.. నివారించే ప్రయత్నం చేస్తోంది. వైరస్ టెస్టింగ్ కిట్స్ విషయంలో.. రూ. 337కి ఇతర రాష్ట్రాలకు అమ్మిన కొరియా కంపెనీ ఏపీకి రూ. 730కి అంటగట్టాలని ప్రయత్నించింది. ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ కావడంతో… వెంటనే ప్రభుత్వం స్పందించింది. కిట్లను సరఫరా చేసిన.. సండూర్ మెడిక్ఎయిడ్ కంపెనీకి ఓ లేఖ రాసింది. ఒప్పందంలో ఉన్న క్లాజుల్ని వివరిస్తూ… అంత కంటే.. తక్కువకు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినందున.. అదే ధరకు తమకు సరఫరా చేయాలని.. అంత వరకు తాము డబ్బులు కడతామని నోటీసులు పంపింది.
సండూర్ మెడికెయిడ్కు వేరే మార్గం లేదు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి.. ఒప్పందంలో కీలకమైన క్లాజులను చేర్చింది. అదే కిట్లను… ఇతరులకు తక్కువకు అమ్మితే.. అంతే మొత్తం తాము కూడా చెల్లిస్తామని చాలా ముందు చూపుతో క్లాజ్ చేర్చింది. అది ఇక్కడ ఉపయోగపడింది. ఇప్పుడు అదే క్లాజును ఉపయోగించి సండూర్ మెడికెయిడ్స్కు నోటీసులు ఇచ్చింది. నిజానికి ఈ కంపెనీకి రెండు లక్షల కిట్లకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి మరో పది లక్షల కిట్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎలా లేదన్నా.. ఆ కంపెనీ రూ. 40 కోట్ల వరకూ ప్రజాధనం కాజేసి ఉండేది. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో.. ప్రభుత్వం వేగంగా స్పందించి.. ఆ సొమ్మును ఆదా చేసే ప్రయత్నం చేసింది. నోటీసులు పంపింది.
వాస్తవానికి ప్రభుత్వం.. ముందూ వెనుకా చూసుకోకుండా.. ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వదు. ఈ కిట్ల విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో.. ప్రభుత్వ వర్గాలకు అంతుబట్టడం లేదు. రాజీవ్ కృష్ణ అనే సలహాదారు.. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఓ ఎంపీ పాత్ర కూడా ఉందని.. సెక్రటేరియట్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయంలో.. ప్రజాధనం ఆదాకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంది. ఇలాంటి వ్యవహారం జరగడానికి కారణమైన వారిపై కూడా తక్షణం విచారణ జరిపించి.. చర్యలు తీసుకుని మరోసారి జరగకుండా.. చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.