ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా పద్దెనిమిది మంది చనిపోయారు. వారెందుకు చనిపోయారో స్పష్టత ఉంది. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం పట్టించుకోవాలని అనుకోవడం లేదు. కల్తీ సారా తాగి చనిపోయారని స్థానికంగా తెలుసు. మెడికల్ రిపోర్టుల్లోనూ అవే ఉన్నాయి. కానీ అతిగా తాగి..భోజనం, నీళ్లు కూడా లేకుండా తాగి తాగి చచ్చిపోయారని మంత్రి తేల్చేశారు. ఏం తాగారన్నది చెప్పడం లేదు. వారు తాగింది నాటు సారా అన్నదానిపై స్పష్టత ఉంది కానీ గుర్తించడానికి ప్రభుత్వ వర్గాలు సిద్ధంగా లేవు.
సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తిస్తాయి. కానీ ఈ ప్రభుత్వంలో శానిటైజర్ మరణాలు… నాటు సారా మరణాలు చోటు చేసుకుంటున్నా.. వాటిని కట్టడి చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు చాలా పరిమితంగా ఉంటున్నాయి. అంతే కాదు.. వాటిని సాధారణ మరణాలుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులు ప్రజలు ఏముకుంటున్నారన్నదాని కన్నా.. మీడియాలో ఫలానా విధంగా ప్రచారం జరగకూడదు.. అన్న కారణంగానే ముందుకెళ్తున్నారు. ఫలితగా బాధితలకు అన్యాయం జరుగుతోంది.
అవి నాటు సారా వల్ల మరణాలని అధికారికంగా గుర్తించకపోయినా.. అసలు సారా ఎక్కడి నుంచి వస్తుంది.. ఎవరు తయారు చేస్తున్నారు… వెనుక ఎవరు ఉన్నారు వంటి వాటితో పాటు ప్రజలు నాటుసారాకు ఎందుకు బానిసలవుతున్నారన్న అంశంపైనా దృష్టి పెట్టాలి. కానీ ప్రభుత్వం.. ప్రాణాలు పోతే పోయాయి కానీ మీడియాలో ప్రచారం కాకపోతే చాలనుకుంటోంది. ఈ పరిస్థితి వల్ల ప్రభుత్వం పై మరింత వ్యతిరేకత పెరుగుతోంది.