సినిమాల ప్రి రిలీజ్ ఫంక్షన్లకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు పెడుతున్న షరతులు .. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. నిజానికి గతంలో ఇలాంటి వేడుకలకు పోలీసులు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా అనుమతి ఇచ్చేవారు. ఎందుకంటే ఇలాంటి వేడుకలు జరిగితే ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఏపీలో ఉన్న ప్రభుత్వం వేరు… ముందస్తుగా అనుమతులు ఇచ్చి.. తర్వాత పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి అనుమతి ఇవ్వలేమని మాట మార్చడం కామన్ అయిపోయింది.
తాజాగా ఒంగోలు వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో పోలీసులు చుక్కలు చూపించారు. మొదట ఏబీఎం గ్రౌండ్ కు అనుమతించి తర్వాత రద్దు చేశారు. ఊరి బయట పెట్టుకుంటే.. అక్కడా పర్మిషన్ ఇవ్వడానికి చాలా షరతులు పెట్టారు. అందులో ఒకటి.. వెయ్య మంది పోలీసుల్ని భద్రతకు పెడతాం… ఒక్కొక్కరికి వెయ్యిచొప్పున చెల్లించాలని రూల్ పెట్టారు. అంతేనా అంత మందిని పెట్టినా… ఎలాంటి ఘటనలు జరిగినా.. ట్రాఫిక్ జాం జరిగినా నిర్వాహకులదే తప్పని షరుతులు పెట్టారు. ఇలాంటి షరతులు చూసి ఏర్పాట్లు చేసుకుంటున్న శ్రేయాస్ మీడియా వారు షాక్ కు గురయ్యారు .
వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూ ఇదే సమస్య. అధికారులు అనుమతులు ఇవ్వడానికి భయపడుతున్నారు. పై నుంచి వచ్చే సూచనలు పాటిస్తున్నారు. దీంతో ఏర్పాట్లు చేసుకోవడానికి నిర్వాహకులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం ఇలా సినీ ఫంక్షనే చేయనివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తే ఎవరైనా ఇక షూటింగ్ ల కోసం ఎందుకొస్తారని సినీ జనం ప్రశ్నిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం రమ్మని అడగదు కదా… వాళ్ల రాజకీయం వేరే !