వంద అడుగులకో పోలీసు..!
ప్రతీ పోలీసు దగ్గర తుపాకీ..!
వంద మీటర్లకో ముళ్ల కంచె..!
దాన్ని దాటి రాకుండా అడ్డుకునేందుకు అక్కడ పది మంది పోలీసులు..!
గ్రామాల్లో ప్రతీ ఇంటికో పోలీసు..!
ఇళ్ల మధ్య స్పెషల్ బెటాలియన్స్ ఇనుప బూట్ల చప్పుళ్లతో కవాతు..!
ఇవన్నీ కశ్మీర్లో వేర్పాటువాద శక్తుల ప్రభావం ఉన్న ఊళ్లలోని భద్రతా ఏర్పాట్లు కాదు. ఎలాంటి క్రైమ్ రికార్డూ లేని.. పోలీసులు చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లోని పరిస్థితి. అక్కడి పరిస్థితుల్ని.. అత్యాధునిక ఆయుధాలతో ఉన్న పోలీసుల్ని… వాళ్ల ఊరికెళ్లి.. వాళ్లనే కొట్టమని ఆదేశాలిచ్చే.. అజ్ఞాతపు శక్తుల్ని … చూసిన తర్వాత .. విన్న తర్వాత.. నిజంగా కశ్మీర్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా.. అని ఆశ్చర్యపోక తప్పదు.
కనీవినీ ఎరుగని నిర్భంధంలో రాజధాని గ్రామాలు..!
అమరావతి రాజధాని గ్రామాలు… మిలటరీ డ్రెస్సులతో భయపెట్టేలా ఉన్న స్పెషల్ ఫోర్స్ బూట్ల చప్పుళ్లతో.. మార్మోగిపోతున్నాయి. అక్కడి ప్రజలెవరైనా సరే భయటకు రావడానికి భయపడాలన్నట్లుగా.. అక్కడ పోలీసుల పరేడ్ జరుగుతోంది. వారి చేతుల్లో ట్రిగ్గర్ నొక్కితే… బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోతాయని.. భయపడేలా… పొజిషన్లో ఆధునాత తుపాకులున్నాయి. ఇళ్ల మధ్యనే వారి కవాతు సాగుతోంది. పొలాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఎవరైనా బయటకు వస్తే.. వారి పని అయిపోయినట్లేనన్న పరిస్థితి అక్కడ ఉంది.
ఉగ్రరూపం చూపిస్తున్న మహిళలు..!
రాజధాని గ్రామాల్లో మహిళలు… ఉద్యమంలో పోల్ పొజిషన్ తీసుకున్నారు. తామే ముందుండి అన్నీ నడిపిస్తున్నారు. రాజధాని గ్రామాల నుంచి పాదయాత్రగా కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వెళ్లి అక్కడ అమరావతి కోసం పూజలు చేయాలనుకున్నారు. స్టార్టింగ్ పాయింట్‌గా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనివ్వకూడదని.. పోలీసులు నిర్ణయించుకున్నారు. మహిళలు పాదయాత్ర చేస్తే.. ప్రభుత్వానికి .. పోలీసులకు వచ్చే నష్టమేంటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ పోలీసులు మాత్రం.. వెనక్కి తగ్గలేదు. అందర్నీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మహిళలు వెనక్కి తగ్గలేదు. అయినా సరే.. పోలీసులు లెక్క చేయలేదు. మహిళల పెడరెక్కలు విరిచికట్టి.. వ్యాన్లలో పడేశారు. లాఠీచార్జ్ చేశారు. మహిళల్ని దొరికిన వారిని దొరికిటన్లుగా చితకబాదారు.
పాదయాత్ర అంటే సర్కార్‌కి అంత భయమా..?
మహిళలు పాదయాత్ర చేస్తున్నారంటే.. సర్కార్..ఎందుకు అంత భయపడిందో చాలా మందికి అర్థం కావడం లేదు. రాజకీయ నేత అని చెప్పుకునేవారు ఒక్కరు కూడా మహిళల వెంట లేరు. దాదాపుగా అందర్నీ… పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎవర్నీ రాజధాని గ్రామాలకు వెళ్లనీయలేదు. మహిళలే స్వచ్చందంగా పాదయాత్రకు బయలుదేరారు. కానీ పోలీసులు నిలిపివేశారు. మహిళల పాదయాత్రతో .. ఎలాంటి శాంతిభద్రతల ఇబ్బందులు వస్తాయో.. పోలీసులు కూడా సమర్థించుకోలేని పరిస్థితి.
గతంలో ఇలా చేసి ఉంటే పధ్నాలుగు నెలలు జగన్ పాదయాత్ర చేయగలిగేవారా..?
జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పధ్నాలుగు నెలల పాటు ఏపీలో పాదయాత్ర చేశారు. ఎక్కడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు లేవు. పైగా.. పటిష్టమైన సెక్యూరిటీ కల్పించారు. కానీ.. రాజకీయ నేతలు కాకుండా.. కేవలం.. మహిళలు మాత్రమే పాదయాత్ర చేస్తూంటేనే… జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులను అడ్డు పెట్టుకుని.. ప్రజాస్వామ్యిక నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేయడం.. తీవ్ర వివాదాస్పదమవుతోంది.