కొత్త జిల్లాల పేరుతో పోలవరం నిర్వాసితుల్ని ఘోరంగా మోసం చేశారని.. వారికి జిల్లా కేంద్రాన్ని మూడు వందల కిలోమీటర్ల దూరం చేసి పరిహారం కోసం రావాలంటేనే ఇబ్బందులు సృష్టిస్తున్నారని .. తాము వచ్చాక ఈ తప్పును సరి చేస్తామని పవన్ కల్యాణ్ లేఖ రాసి ఇరవై నాలుగు గంటలు కాలేదు. అప్పుడే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి.
మంత్రి పేర్ని నాని కూడా అదే చెబుతున్నారు. మరో కొత్త జిల్లాపై ఆలోచన చేస్తున్నామని అది కూడా గిరిజన ప్రాంతాలతోనే ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలతోనే ఉన్నాయి. అయితే పోలవరం ముంపు ప్రాంతాల జిల్లా కేంద్రాలు ఎంతో దూరం. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగింది.
పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అభ్యంతరాలను లేవనెత్తారు. దీంతో వాటిని కలుపుతూ జిల్లాను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఏపీకి 27 జిల్లాలు అవుతాయి. ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇరవై ఏడు జిల్లాలు అయినట్లవుతుంది.