ఆయనేమో పాదయాత్రా చేస్తాం చేస్తాం అని అంటుంటారు, అదెలాగో చూస్తాం చూస్తాం అని పోలీసులు భీష్మిస్తున్నారు. కిర్లంపూడిలో ప్రతీరోజూ ఇదే హైడ్రామా! కాపు ఉద్యమ నేత ముద్రగడ దినచర్య ఎలా మారిందీ అంటే… ఉదయాన్నే పాదయాత్రకు ఇంటి నుంచీ బయలుదేరడం, బయటకి రాగానే పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం! గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తామంటే అడ్డుకోవడం తగదని ముద్రగడ వాదించడం, మీ యాత్రకు అనుమతుల్లేవని పోలీసులు చెప్పడం! ఇదే నిత్యకృత్యం అయిపోయింది. ఇంతకుమించి జరగదని తెలిసినా ముద్రగడ వ్యూహం మార్చుకోవడం లేదన్న చర్చను కాసేపు పక్కనపెడితే… ముద్రగడ పాదయాత్ర విషయంలో ప్రభుత్వం కోరుకుంటున్న ముగింపు ఏంటో ఇప్పటికీ స్పష్టం కావడం లేదు!
కాపుల రిజర్వేషన్ల డిమాండ్ తో గతనెల 26న ఛలో అమరావతి పాదయాత్రను ముద్రగడ తలపెట్టారు. అయితే, అప్పటికి నెలరోజుల ముందు నుంచే అడ్డుకునే ప్రయత్నాలు ప్రభుత్వం తరఫున మొదలైపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో నిషేదాజ్ఞలు పెట్టారు. యాత్రకు అనుమతి లేదన్నారు. తుని ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలు ముఖ్యమన్నారు. అప్పట్నుంచీ ఈరోజు వరకూ ముద్రగడ గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఓవారం పాటు గృహ నిర్బంధం ఉంటుందని ముందుగా పోలీసు అధికారులు చెప్పారు. కానీ, ఆ గడువు ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నారు. అయితే, ఈ డ్రామా ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారనేదే అసలు ప్రశ్న..? గతంలో ముద్రగడ దీక్షకు దిగిన సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చిన ముగింపు ఎలా ఉండేదంటే… అరెస్టుతో అయిపోయేది! ఆసుపత్రిలో చేర్చడంతో చేయడంతో ముద్రగడ దీక్షకు ఫుల్ స్టాప్ పెట్టేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే, ఇప్పుడాయన చేస్తానంటున్నది పాదయాత్ర కదా! ఆయన యాత్రకు వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ అడ్డుకుంటున్నారు. ఇలా ఎన్నాళ్లు అడ్డుకుంటూ ఉంటారు..?
ముద్రగడకు విసుగు వచ్చి, పాదయాత్ర ఆలోచన ఆయన మానుకునేంత వరకూ వేచి చూడటమే పోలీసుల వ్యూహమా..? పోనీ, ఆయన్ని అరెస్టు చేసి ముగింపు ఇద్దామనుకుంటే, తదనంతర పరిణామాలు మరింత జఠిలంగా మారుతాయని భయపడుతున్నారా..? పోలీసు కోణం నుంచీ కాకుండా ప్రభుత్వ కోణం నుంచి ఆలోచిస్తే… మంజునాథ కమిషన్ కు లేఖ రాశామని కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వండని ఆ లేఖలో పేర్కొన్నారు. కనీసం, ఆ నివేదిక ఏదో త్వరగా తెప్పించే ప్రయత్నం చేస్తే, ముద్రగడ పాదయాత్ర ప్రయత్నాలను విరమింపజేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వం అలాంటి ప్రయత్నమేదీ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ముద్రగడ విషయంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చర్యలకు దిగితే… ఆ మేరకు ప్రతిపక్షం నంద్యాలలో లాభపడుతుందనే ఆందోళన అధికార పార్టీకి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముద్రగడ పాదయాత్ర ప్రయత్నాలను ఎలా విరమింపజేయాలా అంశంపై ప్రభుత్వానికే ఒక స్పష్టత లేదని చెప్పుకోవచ్చు.