అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు మాత్రమే వర్తించేలా చేయడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందు అడుగులు వేయడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే. మొదట్లో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులకు కూడా వర్తింప చేయాలి అనుకున్న ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేసేలా మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం సోషల్ మీడియా విజయంగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు . వివరాల్లోకి వెళితే
ఎన్నికల ప్రచారం సందర్భంగా ” మీరు మీ పిల్లల్ని స్కూల్ కి పంపించండి చాలు, అలా స్కూల్ కి పంపిస్తే ప్రతి తల్లికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తాను” అని జగన్ వాగ్దానం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని జగన్ భావించారు. కానీ ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత కనిపించింది. ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలి అనే నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత ఘోరంగా మారుతుందని, ఒకరకంగా చూస్తే , ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల నడ్డి విరుస్తోందని అనేక విమర్శలు వచ్చాయి . ఈ విమర్శల కారణంగానో ఏమో కానీ మొత్తానికి, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు పథకాన్ని వర్తింప చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన బాధ్యత ప్రతిపక్షానిది. అయితే అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింప చేయాలని గట్టిగా గళం విప్పితే ఓట్లు పోతాయేమో అన్న భయం విపక్షాలది. ప్రతిపక్షం కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ్యత మీడియా తీసుకుని ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాన్ని ఎదిరించే దమ్ము ఏ మీడియా సంస్థకు లేనట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా మీడియా సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అది మరొక రాజకీయ పక్షానికి తొత్తు గా వ్యవహరించే సంస్థ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింప చేయాలని గట్టిగా గళం విప్పారు. ఆ గళం ప్రభుత్వం దాకా చేరిందో ఏమో కానీ మొత్తానికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది.
ఏదేమైనా, ప్రతిపక్షం కానీ ప్రధాన మీడియా కానీ నోరు మెదపకుండా ఉన్న ఈ పథకం విషయంలో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకునేలా చేయడంలో సోషల్ మీడియా ఈసారికి విజయం సాధించిందని చెప్పవచ్చు.