విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న పదిహేను ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైఎస్ హయాంలో 34.44 ఎకరాలను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే అందులో అంతటా స్టూడియో నిర్మించలేదు. నిబంధనల ప్రకారం ఇతర అవసరాలకు ఆ భూమిని ఉపయోగించకూడదు. వినియోగిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.
అయితే రామానాయుడు స్టూడియో యాజమాన్యం అందులోని 15కుపైగా ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు 2023లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకుని విల్లాల నిర్మాణం చేపట్టింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పి కోర్టుల్లో కేసులు పడటంతో ఆగిపోయింది.ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినందున ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా స్టూడియో నిర్మించిన భూమిపైనా నియంత్రణ ఉంచాలని నిర్ణయించింది. సినీ అవసరాలకు తప్ప దేనికి ఉపయోగించినా ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకుంటారు.
గత ప్రభుత్వంలో విశాఖలో అనేక ల్యాండ్ డీల్స్ జరిగాయి. సెటిల్మెంట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోను స్వాదీనం చేసుకుంటామని బెదిరించి మరీ.. అందులో సగం లెక్క కట్టి.. పదిహేను ఎకరాలను వైసీపీకి చెందిన వారు లాక్కున్నారని అంటున్నారు. అందుకే అక్కడ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. చివరికి ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వ పరం అయింది.