కాపుల రిజర్వేషన్ల హామీ టీడీపీ సర్కారుకు పంటికింద రాయిలా మారిన వ్యవహారం! ఇంకా ఉపేక్షిస్తూ పోతే వచ్చే ఎన్నికల నాటికి ఇదో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఎన్నిక నాటికి కాపు సామాజిక వర్గం ఎంత కీలకంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, హుటాహుటిన కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కావడం.. కాపు నేతలు చెప్పిన సమస్యలను వినడం, రిజర్వేషన్లపై సానుకూలంగా స్పందించడం, తొందరపడితే పనులు కావంటూ సంకేతాలు ఇవ్వడం, రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ ను తామే గుర్తించామని చెప్పడం… అన్నీ జరిగిపోయాయి! ఇవన్నీ స్వల్పకాలిక ప్రయోజనాలుగా కనిపిస్తున్నా.. దీర్ఘ కాల వ్యూహంతోనే టీడీపీ ఈ భేటీని నిర్వహించిందని చెప్పొచ్చు. ఆ వ్యూహం ప్రధాన లక్ష్యం ఏంటంటే.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం తగ్గించడం!
కాపు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మార్చడంలో ముద్రగడ పద్మనాభం కొంతమేర విజయం సాధించినట్టే. తరచూ ఉద్యమాలు, దీక్షలు, ప్రకటనలూ అంటూ ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో ఒక ఆలోచనను రేకెత్తించారు. తమ వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారనే అభిప్రాయాన్ని తీసుకెళ్లగలిగారు. దీన్ని తట్టుకోవడం కోసమే కాపు కార్పొరేషన్ ను సర్కారు ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ల విషయాన్ని వాయిదా వేస్తూ కొన్నాళ్లు నెట్టుకొచ్చింది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఈ అంశాన్నే ప్రధాన సమస్యగా ముద్రగడ చిత్రించే అవకాశం ఉంది. పరిస్థితిని అంతవరకూ వెళ్లనీయకూడదంటే.. ఇక్కడే బ్రేకులు పడాలి. ప్రస్తుతం చంద్రబాబు చేసింది అదే అని చెప్పొచ్చు!
ప్రస్తుతానికి ముద్రగడ ఉద్యమాలను భద్రతా కారణాలతో కట్టడి చేస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం ఆయన వైపు చూడకుండా చేయాలన్నదే ఈ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే క్యాబినెట్ లో ఐదుగురు కాపు నేతలున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీలూ ఎమ్మెల్యేలు కూడా బాగానే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కాపు నేతలకు ప్రాధాన్యత పెంచి, ఆ సామాజిక వర్గ సమస్యలపై వారే స్పందించేలా చేయడం ద్వారా ముద్రగడ ప్రభావాన్ని తగ్గించాలని భావిస్తున్నట్టున్నారు. ఈ క్రమంలో ముద్రగడ ప్రత్యామ్నాయంగా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను తెర మీదికి తెస్తున్నారు.
నిజానికి, ముద్రగడకు ధీటుగా స్పందించడంలో చినరాజప్ప ముందుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఉద్యమించిన ప్రతీసారీ చినరాజప్ప విమర్శలకు దిగుతారు. ప్రభుత్వ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తారు. తాజా విజయవాడ సమావేశం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ సమావేశంతో కాపు నేతలకు ఆయనే పెద్ద దిక్కు అన్నంత ప్రాధాన్యత చినరాజప్పకి ఇచ్చారు. ఆయనే ముందుండి కాపు నేతలతోనే సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పించడం విశేషం. ఈ సమావేశం ద్వారా కాపు సామాజిక వర్గంలో ముద్రగడ ప్రాధాన్యతను కొంత తగ్గించామనే ఆ పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి, ఈ వ్యూహాన్ని ముద్రగడ ఎలా తట్టుకుంటారో చూడాలి..?