ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఎంత మొత్తం ఖర్చు పెట్టారో చెప్పాలని హైకోర్టు చాలా రోజుల కిందట ఆదేశించింది. ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే… అణా.. పైసలతో సహా క్షణాల్లో లెక్కలు తీసుకెళ్లే అధికారులు హైకోర్టు అడిగితే మాత్రం.. వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ అయింది. అకౌంటెంట్ జనరల్‌ను హైకోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించాల్సి వచ్చింది. రైతులు వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు.. రాజధాని నిర్మాణ ఖర్చులపై అకౌంటెంట్ జనరల్ నివేదిక సమర్పించాలని గతంలో ఆదేశించంది. కానీ ఇప్పటి వరకూ సమర్పించలేదు. అధికారులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ జనరల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
వచ్చే సోమవారంలోగా తాము అడిగిన నివేదికను సమర్పించాలని, లేనిపక్షంలో అకౌంటెంట్ జనరలే నేరుగా కోర్టుకు రావాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాజధాని నిర్మాణాల కోసం నేటివరకు చేసిన వ్యయం, ఇందుకోసం వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చిన రుణాలు, మధ్యలోనే రాజధాని నిర్మాణాలను నిలిపివేయడంతో కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన క్లైయిమ్ ల వివరాలను అందించాలని హైకోర్టు ఆదేశించింది. రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు.
అమరావతికి అసలు గత ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు చెబుతూ ఉంటారు. టీడీపీ నేతలు మాత్రం.. పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతూ ఉంటారు. చాలా సంస్థలు పనులు మధ్యలో నిలిపివేశాయి. ఒప్పందం ప్రకారం.. అలా నిలిపివేయమని ప్రభుత్వం చెబితే.. పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ రహస్యంగా ఉన్నాయి. అవి బయటకు వస్తేనే అమరావతి ఖర్చు గురించి పూర్తి సమాచారం బయటకు వస్తుంది.