సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై సమీక్షించబోతున్నారు. ఇప్పటికే రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గం ఉపసంఘం అధికారులతో వివరాలను అడిగి తెలుసుకుంది. భూముల కేటాయింపు, టెండర్లు వంటి అంశాల్లో అవకతవకలు జరిగాయని, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. వీటి వివరాలను కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏపీ రాజధానిపై ప్రాథమిక నివేదికను అందజేశారు.
రాజధానిపై సీఎం జరపనున్న సమీక్షా సమావేశంలో రాజధానిగా అమరావతి కొనసాగింపుపై ఓ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. అయితే అటువంటి అవకాశాల్లేవని మరికొందరు చెప్తున్నారు. కేవలం రాజధాని పనులపై సమీక్షించటం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని, అధికారుల కమిటీతోపాటు కేబినెట్ సబ్ కమిటీ నుంచి కూడా ఒక నివేదికను తీసుకుంటారని భావిస్తున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, అవకతవకలపై త్వరలోనే అన్ని వివరాలను బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రాజధానిపై ఆందోళన జరుగుతున్న సమయంలో గురువారం నాటి సమీక్ష అనంతరం రాజధానిలో నిధుల దుర్వినియోగం, ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబంధించిన కొన్ని వివరాలను కూడా బయటపెట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వం ఏం చేసినా చర్చనీయాంశంగా మారుతోంది. అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డిని స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో..సీఆర్డీఏ మీటింగ్తో.. ఓ క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.