పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టే నిధులను ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వకూడదని.. నేరుగా పోలవరం ప్రాజెక్ట్ పనుల కోసమే ఖర్చు చేయాలని కేంద్రం నిర్దేశించింది. గత ప్రభుత్వం పోలవరం పనుల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టింది. ఆ సొమ్ము కేంద్రం నుంచి రూ. ఐదు వేల కోట్ల వరకూ రావాల్సి ఉంది. గత నెలలో రూ. పద్దెనిమిది వందల కోట్లను కేంద్రం విడుదల చేసింది. అయితే.. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం కేటాయించలేదు. ఇతర అవసరాల కోసం మళ్లించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు కోసం పనులు చేసిన వారికి చెల్లింపులు జరగలేదు. పోలవరంలో ఇప్పటికీ దాదాపు రూ.320 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఏపీ ఖర్చు చేసిన మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ద్వారా.. బిల్లులు పంపితే..కేంద్రం ఆడిటింగ్ చేసి నిధులు మంజూరు చేస్తుంది. అవి నేరుగా రాష్ట్ర ఖజానాకు చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పోలవరం నిధుల్ని మళ్లిస్తూండటంతో.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ.. పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చేలా ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇక నుంచి కేంద్రం విడుదల చేసి నిధులు నేరుగా ఆ ఖాతాకు జమ అయ్యేలా చూస్తారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితోనే ఆ నిధులు వెచ్చించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పోలవరం అథారిటీలో ప్రత్యేకంగా ఆమోదం తీసుకుని పంపాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
పోలవరం నిధుల దారి మళ్లకుండా.. కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయదల్చుకున్న ఖాతా కోసం.. పోలవరం అథారిటీ అధికారులతో 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను మార్చివేయడంతో… పనులు సాగడం లేదు. మొదట వరదలు… ఆ తర్వాత కాంట్రాక్టర్ల గొడవ.. ఆ తర్వాత కరోనా కారణంగా.. పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఏపీ సర్కార్ బడ్జెట్లో నిధులు కేటాయించడంలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా.. ఇతర అవసరాలకు వాడింది. దాంతో ఇప్పుడు పోలవరానికి నిధుల కొరత తలెత్తింది.