దుబాయ్‌కు వెళ్లి రూ. కోట్లు ఖర్చు పెట్టి బ్రాండింగ్, ప్రమోటింగ్ చేసి మరీ ఎంవోయూ చేసుకున్న రూ. మూడు వేల కోట్ల పెట్టుబడుల అంశంపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం నోరు తెరవడం లేదు. కాజస్ ఈ మొబిలిటి అనే కంపెనీ కడపలో మూడు వేల కోట్లతో పరిశ్రమ పెట్టేందుకు ఎంవోయూ చేసుకున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రకటించారు. ఆ అంశంపై రెండురోజుల నుంచి దుమారం రేగుతోంది. ఆ కంపెనీ బండారాన్ని తెలుగు 360 బయట పెట్టింది. తప్పయితే చెప్పాలని సవాల్ చేసింది.
అలాగే విపక్ష పార్టీలు.. తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సూట్ కేసు కంపెనీల బుద్ది పోనిచ్చుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇటు మీడియా.. అటు టీడీపీ నేతలు కాజస్ కంపెనీ బండారం బయట పెట్టి తీవ్ర విమర్శలు చేస్తున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే అధికారికంగా ఎంవోయూ చేసుకున్నారు. ఏమని చేసుకున్నారు.. ఏమేమి ప్రయోజనాలిస్తామన్నారు అన్నీ వెల్లడించాల్సి ఉంది. అసలు ఏం చూసి ఆ కంపెనీతో ఎంవోయూ చేసుకున్నారో వెల్లడించాల్సి ఉంది.
కానీ ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా ఉంది. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని మీడియాపై ఉసిగొల్పి బూతులు తిట్టిస్తున్నారు కానీ నిజాలు మాత్రం చెప్పడం లేదు. ఎంవోయూ చేసుకున్న ఏపీఈడీబీ కూడా ఈ అంశంపై స్పందించడ లేదు. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా సూట్ కేసు కంపెనీ ద్వారా అక్రమ సొమ్మును ఇండియాలోకి పంపించేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలపడే అవకాశం ఉంది.