గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వద్ద తన పంతం నెగ్గించుకున్నారు. ఫైల్ పంపి నాలుగు రోజులైనా ఆమోదం లభించకపోవడంతో పాటు… నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరిపై గవర్నర్‌కు అభ్యంతరాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో… సీఎం జగన్ నేరుగా గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత కాసేపటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ.. సంతకం చేశారు. దీంతో.. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, మోషేన్ రాజులు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న కారణంగా గవర్నర్ ఆలోచిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో రమేష్ యాదవ్ అనే వైసీపీ నేతపై హత్య కేసు ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. టీడీపీ నేత వర్ల రామయ్య.. నేరుగా గవర్నర్‌కే లేఖ రాశారు. నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని.. గవర్నర్ కోటా కింద నియమించే వారిని స్వచ్చమైన వారిని నియమించాలని కోరారు.
అయితే.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్..ఆమోదముద్రవేశారు. దీంతో ప్రభుత్వానికి టెన్షన్ తీరిపోయింది. ప్రభుత్వం పంపిన పేర్లను వెనక్కి పంపినట్లయితే.. జగన్ సర్కార్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. ఆ పరిస్థితి రాకుండా.. సరైన సమయంలో జగన్ రంగంలోకి దిగి.. గవర్నర్‌కు వివరణ ఇచ్చారు.